-పరిశుభ్రత వారోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-స్వచ్ఛ సర్వేక్షణ్ లో నగరాన్ని తొలి స్థానంలో నిలపడమే లక్ష్యం: నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పరిశుభ్రత వారోత్సవాలలో భాగంగా వాంబే కాలనీ H-బ్లాక్ నందు నిర్వహించిన ‘సుందర హరిత విజయవాడ’ కార్యక్రమంలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డిలతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా క్లైమెట్ స్మార్ట్ సిటీస్ అసెస్ మెంట్ ఫ్రేమ్ వర్క్ 2.0 లో వీఎంసీకి దేశవ్యాప్తంగా నాలుగో స్థానం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సూరత్ లో అవార్డును అందుకున్న నగర మున్సిపల్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. నగరాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న కార్పొరేషన్ సిబ్బందికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నగర కమిషనర్ గా స్వప్నిల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానంగా శానిటేషన్ పై దృష్టి సారించడం సంతోషకరమని మల్లాది విష్ణు అన్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రధాన ప్రాంతాలతో పాటుగా చిన్న చిన్న వీధులను కూడా ఎవరు బాధ్యులో మ్యాపింగ్ చేయగలిగితే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ప్రతి కాలనీలోనూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట త్రాగునీరు అందించేలా చూడాలన్నారు. అలాగే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీళ్లు నిలిచే ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వారోత్సవాలలో భాగంగా రోజుకో అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడం మంచి పరిణామమని మల్లాది విష్ణు తెలిపారు. ఇదేవిధంగా కార్యక్రమాలను ప్రతినెలా ముందుకు తీసుకువెళ్లగలిగితే.. పారిశుధ్ధ్యంలో విజయవాడ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ లో విజయవాడ నగరం ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని, తొలి స్థానమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. ఇందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమని వెల్లడించారు. ఒక ప్రదేశం అధ్వానంగా ఉందంటే.. అందరూ చెత్తను అక్కడే పడవేస్తారని, కానీ ఆ ప్రదేశాన్ని సుందరీకరించగలితే ఎవరూ కూడా అక్కడ చెత్త పడవేసే పరిస్థితి ఉండదన్నారు. ఇందుకోసం మురుగు ప్రాంతాల సుందరీకరణ, యాంటీలార్వా ఆపరేషన్స్, మొక్కలు పెంచడం వంటి కార్యక్రమాలను రోజుకొకటి చొప్పున వారోత్సవాలలో భాగంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం మొక్కలను నాటి.. ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉమ్మడి రమాదేవి, అలంపూర్ విజయలక్ష్మి, జానారెడ్డి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, 60వ డివిజన్ వైసీపీ కోఆర్డినేటర్ బెవర నారాయణ, అడిషనల్ కమిషనర్(జనరల్) శ్యామల, సీఎంఓహెచ్ గీతా భాయ్, ఈఈ శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, డీఈ గురునాథం, నాయకులు ఉమ్మడి వెంకట్రావు, అలంపూర్ విజయ్, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.