-30 లక్షల పనిదినాలు లక్ష్యంకాగా ఇప్పటివరకు 50 లక్షల పనిదినాలు కల్పించాం…
-జిల్లాలో 15 చెరువులలో పూడిక తీసి సుందరీకరిస్తున్నాం…
-ఆగస్టు 15న చెరువుల వద్ద జాతీయ జెండాను ఎగురువేసి అమృత సరోవర్ నిర్వహిస్తాం…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కూలీలకు లక్ష్యానికి మించి ఉపాధి హామి పనిదినాలు కల్పించామని, ఉపాధి హామి పనుల ద్వారా 15 చెరువులలో పూడిక తీసి సుందరీకరిస్తున్నామని ఆయా చెరువుల వద్ద ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం సమరయోధులతో జాతీయ జెండాను అవిష్కరించి అమృత సరోవర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
జి. కొండూరు మండలం కందులపాడు గ్రామం వద్ద ఉపాధి హామి పనుల కింద చెరువు పూడిక తీత పనులను శనివారం డ్వామా అధికారులతో కలిసి కలెక్టర్ డిల్లీరావు పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూలీలకు ఉపాధి హామి పని దినాలు కల్పించడంలో రాష్ట్రంలోనే ఎన్‌టిఆర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది 30 లక్షల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్థేశించగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 50 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో 1.23 లక్షల కుటుంబాలలోని 2.12 లక్షల మంది కూలీ కార్మికులు పనులు చేస్తున్నారన్నారు. వీరిలో 59.04 మంది మహిళా కార్మికులు ఉపాధి హామి పనులలో పాల్గొన్నారన్నారు. 41 శాతం మంది కుటుంబాలు ఉపాధి హామి పనులను ఉపయోగించు కున్నారన్నారు. ఉపాధి హమీ కూలీలకు వారు చేసిన పనులను ఆధారంగా సగటు వేతనం రోజుకు 247 రూపాయలు వేతనం కింద చెల్లించడం జరిగిందన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమృత సరోవర్ పథకం కింద చెరువుల పూడిక తీత పనులను చేపట్టామన్నారు. జిల్లాలోని విస్సన్నపేట, మైలవరం, జి. కొండూరు, నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట తదితర మండలాలలో 15 చెరువులలో పూడిక తీత పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. చెరువులను అభివృద్ధి చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి చెరువులను సుందరంగా తీర్చిదిద్దేందుకు పండ్ల మొక్కలను నాటడంతోపాటు పంచాయతీల సహకారంతో చెరువు చుట్టూ సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసి ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. ఆధునీకరించిన చెరువుల వద్ద స్థానిక స్వాతంత్య్ర సమరయోదులు ప్రజాప్రతినిధులతో ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఆవిష్కరించి అమృత సరోవర్ ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఉపాధి హామి పనులలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు పంటకాలువలు, పంటబోదులు, అంతర్గతరోడ్లు చెక్‌డ్యామ్‌లు అభివృద్ధి చేయడంతోపాటు మొక్కలను నాటడం సరిహద్దు కందకాలు త్రవ్వకం వంటి పనులను నిర్వహించడం జరిగిందన్నారు. లక్ష్యాన్ని మించి కూలీలకు ఉపాధి హామి పనులను కల్పించేందుకు కృషి చేసిన డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్, ఏపియంలు, ఇంజనీరింగ్, కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో డ్వామా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జె.సునీత, స్థానిక యంపిడివో అనురాధ, తహాశీల్థార్ రోహిణి దేవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News