Breaking News

ప్రజాసాధికారతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-28వ డివిజన్ 203 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజాసాధికారతే లక్ష్యంగా, అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం 28 వ డివిజన్ 203 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, దాసాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కనపర్తి కొండా, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీనగర్, జాగర్లమూడి వారి వీధులలో విస్తృతంగా పర్యటించి.. 230 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారి నుండి సలహాలు, అర్జీలు స్వీకరించారు. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అడిగి తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంట్లో కనీసం ఒక్క సంక్షేమ పథకం ద్వారా అయినా లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. దీర్ఘకాలం ప్రజలకు మేలు చేసే విధంగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. అదే చంద్రబాబు గత పాలనలో 2014లో పెట్టిన మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించారని గుర్తుచేశారు. కానీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తూ.. పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారన్నారు. దీంతో జగనన్న ప్రభుత్వంపై ప్రజలకు అపార నమ్మకం ఏర్పడిందన్నారు. మరోవైపు దశలవారీగా నిర్మితమవుతున్న జగనన్న కాలనీలకు సంబంధించి తొలి విడతలో సెంట్రల్ లో 14,986 ఇళ్లను నిర్మిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. నున్నలో 1,400 ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. అధికారులు, సచివాలయ సిబ్బంది కూడా ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ.. వారంతా త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవడంలో తోడ్పాటును అందించాలన్నారు.

సచివాలయ పరిధిలో రూ. 1.76 కోట్ల సంక్షేమం
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 203 వ వార్డు సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 1.76 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 135 మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 123 మందికి రూ. 15.99 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 35 మందికి రూ. 8.56 లక్షలు., కాపునేస్తం ద్వారా 16 మందికి రూ. 2.40 లక్షలు., చేయూత ద్వారా 10 మందికి రూ. 1.87 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 35 మందికి రూ. 5.25 లక్షలు., వాహనమిత్ర ద్వారా నలుగురికి రూ. 40 వేలు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 10 మందికి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలుగుదేశం నాయకులు భ్రమల్లో బ్రతుకుతున్నారు
గతంలో ప్రధాని మోదీని నోటికొచ్చినట్లు దూషించిన చంద్రబాబు.. మొన్న ఢిల్లీలో ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడితేనే మహర్భాగ్యం అన్నట్లుగా పొంగిపోతున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి విచ్చేసిన అతిథులను మర్యాదపూర్వకంగా పలకరించే క్రమంలో చంద్రబాబుతో ప్రధాని మోదీ మాట్లాడారని.. ఆ మాత్రానికే బ్రహ్మాండం ఏదో బద్దలైపోయినంతగా తెలుగుదేశం నేతలు పబ్లిసిటీ చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా పయ్యావుల కేశవ్, యనమల వంటి వారైతే ఏకంగా గాల్లో మేడలు కట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర పెద్దలను చంద్రబాబు కలిసినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏ మాత్రం లేదని తెలియజేశారు. మరోవైపు తెలుగుదేశం హయాంలో ఏపీలో ఎటువంటి అభివృద్ధి లేదని.. పైగా చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే పోలవరం, అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని మల్లాది విష్ణు ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నారని.. పోలవరం పనులను పరుగులు పెట్టిస్తున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ.. పరిశ్రమలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను అందిస్తున్నారన్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 60 పరిశ్రమలను అమ్మించారని.. కానీ నేడు ఇన్ఫోసిస్‌ లాంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలియజేశారు. కనుకనే రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలు వైఎస్సార్ సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. అటువంటి తమకు వెంటిలేటర్ పై ఉన్న తెలుగుదేశాన్ని చూసి ఉలిక్కిపడవలసిన అవసరం ఏమాత్రం లేదని మరోసారి స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు కమ్మిలి రత్న, వేదాంతం చైతన్య, చిన్నారావు, సూరిబాబు, నక్కా కోటిరెడ్డి, ఆవాల బుజ్జి, శ్రీను, దుర్గాప్రసాద్, గుండె సుందర్ పాల్, భోగాది మురళి, పేరం త్రివేణి రెడ్డి, యక్కల మారుతి, నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *