విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియను స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అసంఘటిత కార్మికుల నమోదు పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శ్రమ్‌పోర్టల్ కార్మికులకు గొప్ప వరం అని అన్నారు. ఈ పథకం ద్వారా కార్మికులకు లభించే సౌకర్యాలపై అవగాహన కల్పించి నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అసంఘటిత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు విధానాలకు ఈ శ్రమ్‌లో నమోదు అయిన వివరాలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. భవన మరియు నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, చిన్న మరియు సన్నకారు రైతులు, కౌలు రైతు, వ్యవసాయ కూలీలు, మత్స్యకార్మికులు, పశుపోషన్నో నిమగ్నమైన వారు, బీడి రోలింగ్ లేబులింగ్ మరియు ప్యాకింగ్ కార్మికులు, తోలు కార్మికులు, ఉప్పు కార్మికులు, ఇటుక బట్టీలు, రాతి క్వారీ కార్మికులు, సామిల్లులలో పనిచేసే కార్మికులు, గృహ కార్మికులు, కూరగాయలు, పండ్ల విక్రేతలు, వార్తా పత్రికలు విక్రేతలు, రిక్షాపుల్లర్లు, ఆటో డ్రైవర్లు, సెరికల్చర్ కార్మికులు, చర్మశుద్ధి కార్మికులు, సాధారణ సేవా కేంద్రాలు, వీధి వర్తకులు, ఉపాధి హామీ కార్మికులు, ఆశా వర్కర్స్, అంగన్వాడి వర్కర్స్, ప్లాంటేషన్ వర్కర్స్, పాల వ్యాపారస్తులు, హమాలీలు, వ్యాపారస్తులు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేని వారు అర్హులు అన్నారు. 16 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు కల్గిన కార్మికులు ఈ పథకానికి అర్హులని అన్నారు. ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదైతే అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతారన్నారు. కార్మికుల వృత్తి నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. సామాజిక భద్రత కోసం ఆర్థిక సహాయం ద్వారా కార్మికులలో నామినీల అకౌంట్‌కు నేరుగా జమ చేయబడుతుందని కలెక్టర్ అన్నారు. నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితమని రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు పోస్ట్ ఆఫీసులు కామన్ సర్వీస్ సెంటర్లలో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో నమోదు చేసుకునే అసంఘటిత కార్మికులు ఆధార్ కార్డు నకలు బ్యాంక్ అకౌంట్ నెంబరు మొబైల్ నెంబర్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్,డిప్యూటి కమీషనర్ ఆఫ్ ల్యాబర్ శ్రీమన్నారాయణ డిపివో ఇన్‌చార్జ్ జె.సునీత, ట్రైనీ డిప్యూటి కలెక్టర్లు రామలక్ష్మి,భాను, కలెక్టర్టేట్ ఏవో ఇంతియాజ్ పాషా, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News