గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోటి 24 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గుడివాడ డిఎస్పి కార్యాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. 1970 నుండి అద్దె భవనంలో డిఎస్పీ కార్యాలయ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, డి.ఎస్.పి కార్యకలాపాలకు శాశ్వత భవనం ఉండాలనే ఉద్దేశంతో డీఎస్పీ కార్యాలయం మరియు నివాస యోగ్యంగా ఉండే భవనాన్ని నిర్మించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అదునాతన హంగులతో సాంకేతికపరమైన మేల వింపుతో, సకల సౌకర్యాలతో గుడివాడలో నూతన డిఎస్పి కార్యాలయ భవన సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం డిఎస్పి ఆఫీస్ రూం, సమావేశ మందిరం, రిసెప్షన్, తదితర ప్రదేశాలను డిజిపి పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. ఇప్పటివరకు డిఎస్పి ఆఫీసు కార్యకలాపాలన్ని అద్దె భవనంలో జరిగాయి. కానీ ఇప్పుడు అధునాతన హంగులతో కూడిన శాశ్వత భవనం ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది. ఈ భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ భవనాన్ని ప్రభుత్వ భవనంగా నిర్ణయిస్తూ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మనకంటూ ఒక శాశ్వత భవనం ఉండి, కార్యకలాపాలు అక్కడ నుండి జరుగుతున్నప్పుడు మాత్రమే పోలీస్ శాఖకు ఒక గుర్తింపు, గౌరవం, హోదా వస్తుంది. అలాగే ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తరచు మీ ప్రాంత పరిధిలో ఉన్న గ్రామాలకు వెళ్లి గ్రామ సందర్శన చేస్తూ సమస్యలను గూర్చి పరిశీలించాలి. తద్వారా నేర శాతాన్ని తగ్గించడం సులభం అవుతుంది. రహదారి ప్రమాదాలు నివారణకు కృషి చేయాలి. మనం చేసే విధుల్లో ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. రాత్రి గస్తీ పెంచుతూ నేరాలు తగ్గించడంలో ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది కృషి చేయాలి. మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రిస్తూ వారి సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించడంలో సహానుభూతి ప్రదర్శిస్తూ, అత్యుత్తమ సేవలు అందించాలి. అందులో భాగంగా సచివాలయ మహిళా పోలీసులు అందిస్తున్న సేవల కారణంగా మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించడానికి పోలీస్ శాఖకు సహాయపడుతుంది. మనం ధరించే యూనిఫామ్ వలన మన యొక్క గుర్తింపు పెరుగుతుంది. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది యొక్క విధులు ఉండాలని ఏ సమస్య ఉన్న పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
డీఐజీ మాట్లాడుతూ ఇప్పటివరకు అద్దె భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఇప్పుడు సకల సౌకర్యాలతో కూడిన శాశ్వత భవనం ఏర్పాటు కావడం, దానికి స్థానిక దాతల అందరి సహకారం ఉండటం చాలా సంతోషంగా ఉందని, ఇకనుండి స్నేహపూర్వక పోలీసింగ్ ను ప్రజలకు అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రముఖ పాత్ర పోషిస్తూ, నేర రహిత సమాజాన్ని ప్రజలకు అందించే దిశగా మనందరి విధులు ఉండాలని తెలిపారు.
ఎస్పి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కుల పరిరక్షణకు పోలీసు వ్యవస్థ కీలకం సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా చూడవలసిన బాధ్యత అంత గౌరవ స్థానం కేవలం పోలీసు వ్యవస్థకు మాత్రమే ఉండటం గర్వకారణం. ఇప్పటివరకు అద్దె భవనంలో ఉంటూ కార్యకలాపాలు కొనసాగించడం జరిగింది. అయితే స్థానిక దాతల అందరూ సహకారంతో సాంకేతిక శోభగులతో కూడిన శాశ్వత భవనం ఏర్పడడం చాలా సంతోషమైన అంశమని, భవన నిర్మాణానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృష్ణాజిల్లా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కొడాలి నాని మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడడంలో ప్రముఖ పాత్ర వహించే పోలీస్ సిబ్బందికి శాశ్వత భవనం ఏర్పడడం చాలా సంతోషంగా ఉందని, మన నేటి కోసం తమ రేపటిని త్యాగం చేస్తూ, కుటుంబాలను సైతం వదిలి సమాజ రక్షణలో ప్రముఖ భాగం పోషిస్తున్న పోలీసులు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తపరిచారు.
కైలే అనిల్ మాట్లాడుతూ ప్రజలందరికీ సమస్య వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది దేవుని గుడి కాదని పోలీస్ స్టేషనే అని, సమాజంలో పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టను మరింత పెంచేలా నూతనంగా నిర్మించిన డిఎస్పీ కార్యాలయ భవనం కు ప్రజలు వచ్చి భయం లేకుండా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రశాంతంగా ఉందని, ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
సమావేశానంతరం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిథి డిజిపి గారిని సత్కరించి జ్ఞాపికను బహుకరించగా, తదుపరి పోలీస్ అధికారులకు ప్రజాప్రతినిధులకు స్థానిక పెద్దలకు డిజిపి చేతుల మీదుగా జ్ఞాపికలు బహుకరించి సత్కరించడం జరిగింది.
భవనం ప్రత్యేకతలు:
ఈ భవనం కింది స్థలం పార్కింగ్ కోరకు, మొదటి అంతస్తు డిఎస్పి కార్యాలయం, రెండవ అంతస్తు డిఎస్పి నివాస సముదాయం, మూడవ అంతస్తు ఉన్నతాధికారుల విశ్రాంతి నిమిత్తం గెస్ట్ హౌస్ భవన నిర్మాణం ప్రత్యేకతలు.
ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డిఐజి జి. పాలరాజు ఐపీఎస్, కృష్ణా జిల్లా ఎస్పీ పి. జాషువా ఐపీఎస్, స్థానిక ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, అడిషనల్ ఎస్పి అడ్మిన్ వెంకట రామాంజనేయులు, అడిషనల్ ఎస్పీ స్పెషల్ అండ్ బ్యూరో అస్మా ఫర్ హిన్, ఇతర పోలీసుల అధికారులు, ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News