-విభిన్న ప్రతిభావంతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం: చైర్మన్ ముంతాజ్ పఠాన్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా విభిన్న ప్రతిభావంతుల మరియు వయోజనుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోజనుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కుమారి ముంతాజ్ పఠాన్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు వారి చేతుల మీదుగా పెట్రోల్ స్కూటర్లు పూర్తి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. నేటి శనివారం జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశ ప్రాంగణంలో జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విభిన్న ప్రతిభావంతులకు తిరుపతి జిల్లాకు మంజూరైన 65 పెట్రోల్ స్కూటర్లను కలెక్టర్ గారు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయోజనుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పంపిణీ చేస్తూ మాట్లాడుతూ నేడు అందజేసిన స్కూటర్ విలువ ఒక్కొక్కటి రూ.1,20,000 కలిగినదని వీటిని పూర్తి ఉచితంగా అందజేయడం జరిగిందనీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం మరియు సౌకర్యార్థం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలోని 18 నుండి 45 సంవత్సరాల లోపు అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు పీజీ చేయు విద్యార్థులకు మరియు స్వయం ఉపాధి చేసుకొనువారికి ప్రాధాన్యతనిచ్చి 65 మందికి రూ.78 లక్షల విలువ కలిగిన పెట్రోల్ స్కూటర్లు పూర్తి ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో సంతోషదాయకం అని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్కూటర్ పొందిన లబ్ధిదారులు ప్రభుత్వం చేసిన సహాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏ వై. శ్రీనివాస్, సూపర్డెంట్ వినోద్ తదితర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News