– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ‘జగనన్నకు చెబుదాం’కు అనుబంధంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ శిబిరాన్ని మారుతీనగర్లోని 30వ వార్డు సచివాలయంలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కార్యక్రమాలకు అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వారికి లబ్ధి చేకూర్చే దిశగా జగనన్న సురక్ష క్యాంపులను నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల వద్ద నెల రోజుల పాటు నిర్దేశిత తేదీల్లో ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరాలలో మండల స్థాయి అధికారుల నుంచి వార్డు సచివాలయ సిబ్బంది వరకు అందుబాటులో ఉంటారన్నారు. అవసరమైన వారికి కుల, ఆదాయ, జనన, మరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, మ్యుటేషన్, అడంగల్ కరెక్షన్, కౌలు రైతుల కార్డులు, ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం, కొత్త రేషన్ కార్డు లేదా కార్డు విభజన వంటి 11 రకాల సర్వీసులను ఎటువంటి సర్వీస్ ఛార్జి లేకుండా జారీ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం వారం రోజులు ముందు నుంచే వాలంటీర్లు, సచివాలయ సెక్రటరీలు, ప్రజాప్రతినిధులు బృందంగా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి వినతులు స్వీకరించారన్నారు. క్యాంపుల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి కావలసిన పత్రాలను సేకరించారన్నారు. 26వ డివిజన్లలోని 4 సచివాలయ పరిధిలో ఉన్న 53 క్లస్టర్లలో 596 అర్జీలు స్వీకరించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వీటిలో 317 క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉండగా.. 267 ఇన్ కం సర్టిపికెట్లు, 2 EWS, 4 కొత్త రేషన్ కార్డులు, మరో 6 రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ కొరకు అర్జీలు వచ్చినట్లు వివరించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా తొలిరోజే వీరందరికీ ఆయా ధృవపత్రాలు ఉచితంగా అందజేస్తుండటంతో.. ఈ ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న నమ్మకం రెట్టింపు అయిందన్నారు.
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ..
ప్రజలకు 11 రకాల ప్రభుత్వ సేవలను ఎటువంటి రుసుం లేకుండా అందజేయడంతో పాటు అర్హులకు సంక్షేమ పథకాలను అందించడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. ఒక్కో కుటుంబం వద్ద కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం కేటాయించి ఇప్పటికే వాలంటీర్లు ప్రజల అభిప్రాయాలను సేకరించడం జరిగిందన్నారు. వారందరికీ ప్రత్యేక శిబిరాల ద్వారా పరిష్కారం చూపడం జరుగుతుందని.. కనుక ప్రతిఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే శిబిరానికి వచ్చే వారికోసం త్రాగునీరు, స్నాక్స్, కూర్చోవడానికి తగిన సౌకర్యాలతో పాటు వైద్య శిబిరాలను సైతం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అనంతరం టోకెన్ నెంబర్ల ఆధారంగా అర్జీదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, పీఓ యూసిడి శకుంతల, సీనియర్ మెడికల్ ఆఫీసర్ సీహెచ్ బాబూ శ్రీనివాసరావు, నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, కోలా నాగాంజనేయులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News