రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ వారు ఆదివారం రాజమహేంద్రవరం లో పలు సంక్షేమ, బాలుర, బాలికల , మహిళల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించడం జరిగింది. జస్టిస్ డి. రమేష్ వారు ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకులం బాలికల వసతి గృహం, బొమ్మూరు , ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఎస్టీ సంక్షేమ వసతి గృహం, బొమ్మూరు, సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహం, కోటిపల్లి బస్టాండ్ మరియు గ్రేస్ చిల్డ్రన్ మిషన్ హోమ్ – ప్రకాష్ నగర్ ల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ వారు సంక్షేమ వసతి గృహంలో గదులను, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అక్కడ రికార్డుల నిర్వహణ తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో అందచేస్తున్న భోజన సదుపాయం తదితర అంశాలపై ఆరా తీశారు. మెనూ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. సీసీ కెమెరా పనితనం, వసతి గృహం నిర్వహణ, పిల్లల హాజరు, సిబ్బంది వివరాలు, నైట్ వాచ్ మ్యాన్ ఉన్నారా తదితర అంశాలను ప్రస్తావించడం జరిగింది. వసతి గృహాల పరిసరాలు, మరుగుదొడ్ల నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తలు అవసరం అని స్పష్టం చేశారు.
అంతకు ముందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ గారు జ్యుడీషియల్ అధికారులు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులతో జువైల్ జస్టిస్ బోర్డ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులతో కూడి సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోస్కో కేసుల గణాంకాలు మరియు స్థితి గతులు, సంక్షేమ వసతి గృహాల్లో అందించాల్సిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ పర్యటన లో డిఎల్ఎస్ఎ చైర్మన్ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె. ప్రత్యూష కుమారి, జిల్లా ఇతర న్యాయమూర్తులు, రెవెన్యూ అధికారి జి.నరసింహులు, ఐ సి డి ఎస్ ఇంఛార్జి పిడి ఎస్. సుభాషిణి, ఇతర అధికారులు ఉన్నారు .