-పేదలకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు అభినందనీయం
-కేంద్ర రోడ్డు రవాణ మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు ఉన్నాయని, ఇక్కడ నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమని కేంద్ర రోడ్డు రవాణ మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని ఆయన గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చెన్నై, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఇవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవని అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు దాదాపు 1600 గుండె సంబంధిత శస్త్రచికిత్సలు ఉచితంగా చేశారని, దీన్ని భగవంతుని సేవగా అభివర్ణించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్న టీటీడీ యాజమాన్యానికి, ఆసుపత్రి డాక్టర్లకు అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా అవయవమార్పిడికి సంబంధించిన డాక్టర్ల కొరత ఉందని, మరింత మందికి శిక్షణ అవసరమని చెప్పారు.
ముందుగా ఆసుపత్రిలోని ఐసియు, ఔట్‌పేషెంట్ విభాగం, ఆపరేషన్ థియేటర్లు, వార్డులను కేంద్రమంత్రివర్యులు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, ఇఇ కృష్ణారెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
అనంతరం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి శ్రీవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జెఈవో వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News