-జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్
మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయి ‘ జగనన్నకు చెబుదాం (స్పందన)’ కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని, వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి ఇది మరింతగా దోహదపడుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో ‘జగనన్నకు చెబుదాం’ మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డీఈవో తాహెరా సుల్తానా, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, డీఆర్‌డీఏ పిడి పి ఎస్ ఆర్ ప్రసాద్, ఐకేపీ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, భూసర్వే సమస్యలపై అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలకు మెరుగైన పరిష్కారం కోసం “జగనన్నకు చెబుతాం” ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు. మండల స్థాయి సర్వేయర్ ఈ కార్యక్రమానికి ఎందుకు గైర్హాజరయ్యారని తహసిల్దార్ శ్రీవిద్యను జెసి ప్రశ్నించారు. డివిజనల్ ఇన్స్పెక్టర్ ఎక్కడ అని ఇన్చార్జ్ ఆర్డిఓ ను జాయింట్ కలెక్టర్ ప్రశ్నించారు. ఆ ఇద్దరు అధికారులు 10 నిమిషాల్లో తన ఎదుట ఉండాలని ఆమె ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారి సైతం జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి హాజరు కాలేదని, గైర్హాజరైన అధికారులకు షోకాజు నోటీసు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు ఇచ్చే ఎండార్స్మెంట్లను తప్పనిసరిగా పరిశీలించి సరిగా ఇచ్చారో లేదో గమనించాలని అవసరమైతే సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.జిల్లా కేంద్రానికి రాలేని వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా.. మండల స్థాయిలో ప్రతి బుధ,శుక్ర వారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కో మండలంలో “జగనన్నకు చెబుదాం” స్పందన కార్యక్రమాన్ని నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామ స్థాయి సమస్యలు.. మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. అర్హతలు ఉండి ప్రభుత్వ పథకాలు అందుకోలేని వారు.. వెంటనే వారి పరిధిలోని సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలన్నారు. “జగనన్నకు చెబుదాం” కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ అధికారులకు సూచించారు. ప్రజల అర్జీలకు అధికారులు అందించే పరిష్కార నివేదికలు.. స్పష్టంగా ఉండాలని.. ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పట్టణ, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News