– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 260 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు అండగా ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గురువారం 58 వ డివిజన్ 260 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కనకదుర్గా నగర్, ఆంధప్రభ కాలనీలో విస్తృతంగా పర్యటించి.. 149 గడపలను సందర్శించారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను వివరించారు. ప్రజలకు అందించిన సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా తెలియజేశారు. 2019 కి ముందు, తర్వాత అన్న విధంగా పరిపాలనలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. గత నాలుగున్నరేళ్లలో డీబీటీ, నాన్-డీబీటీ ద్వారా అక్షరాల రూ. 4 లక్షల 5 వేల కోట్ల మేలును పేద, మధ్యతరగతి వర్గాలకు చేకూర్చినట్లు చెప్పారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పేదరికం 11.77 శాతం నుంచి 6.06 శాతానికి తగ్గిందన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు.
గడప గడపకూ వెళ్లే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా..?
టీడీపీ హయాంలో ప్రజలకు ఇంత మేలు చేశామని గడప గడపకూ వెళ్లి చెప్పే ధైర్యం చంద్రబాబుకు, తెలుగుదేశం నేతలకు ఉందా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఎంతసేపూ ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇంత జవాబుదారీతనంగా ప్రజల ముందుకు వెళ్లి చెప్పిన సంఘటన గతంలో ఎప్పుడూ లేదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను మాయం చేసిందని.. కానీ మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్తున్న ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మల్లాది విష్ణు తెలిపారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం ఏ విధంగా సహాయపడిందో ఇంటింటికి వెళ్లి చెబుతున్నామని.. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 వాగ్దానాలపై మాట్లాడే ధైర్యం పచ్చ చొక్కాలకు ఉందా..? అని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ తీసుకొస్తున్న సంస్కరణలు అద్భుతమని అవార్డులు రూపంలో కేంద్ర ప్రభుత్వం కీర్తిస్తుంటే.. బీజేపీ పెద్దలు మాత్రం విమర్శలు గుప్పిస్తూ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. బలమైన నాయకత్వాన్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలందరూ గమనిస్తున్నారని.. 2024లోనూ ఈ పార్టీలకు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, ఉమ్మడి వెంకట్రావు, వసంత్, గోపాలరెడ్డి, శర్మ, వలి, వజీర్, తోపుల వరలక్ష్మి, యక్కల మారుతి, శోభన్, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News