మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు తమకు ఎంతో మేలును చేకూరుస్తున్నాయని పలువురు లబ్ధిదారులు అభిప్రాయపడ్డారు. గురువారం మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉన్న సుమ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ యస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తో పలువురు లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పొందుతున్న మేలును ముఖాముఖిగా పంచుకున్నారు.
జీ.రమేష్ బాబు, రైతు, ఎస్.ఎన్ గొల్లపాలెం, మచిలీపట్నం మండలం:
నేను చిన్న కారు రైతును. వ్యవసాయ రైతులకు అండగా నిలిచేందుకు దేశ ప్రధాని మోడీ గారు 2019లో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సామ్మాన్ నిధి పథకం ద్వారా రూ.2వేల చొప్పున ఏటా మూడు విడతలుగా మొత్తం రూ.6 వేలు నేరుగా నా ఖాతాకు జమ అవుతూ వస్తున్నాయి. ఈ నగదును విత్తనాలు లేదా పురుగుమందులకు వాడుకుంటున్నాను. సమయానికి పురుగుమందులు వాడటం వల్ల పంట దిగుబడి కూడా పెరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మేలుకు రైతాంగం తరపున ప్రధానమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
పంచకర్ల నరసింహారావు, వ్యవసాయ కూలీ, మల్లవోలు గ్రామం, గూడూరు మండలం:
మా తాతలు, తండ్రుల కాలం నుంచి ఒంటి నిట్టాడు తాటాకు ఇంట్లో నివసించేవారం. ఆ ఇంట్లో ఉంటూ ఎండకు, వానకు, చలికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. ఏ మనిషికైనా కూడు, గూడు, గుడ్డ ఎంతో అవసరం. అలాంటి దుర్భర సమయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నేను పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు రూ.1.80 లక్షలు సబ్సిడీ పొందాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటున్నాను. నాకు ఇంత మేలు చేసిన ప్రధానమంత్రి మోడీ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను.
కీర్తిశాంతి, మాతృమూర్తి, భాస్కరపురం, మచిలీపట్నం మండలం:
నేను గర్భవతిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ పథకం ద్వారా అంగన్వాడి కేంద్రం నుంచి పౌష్టికాహారాన్ని తీసుకున్నాను. పోషకాహార లోపం లేకపోవడం వల్ల మా పాప ఆరోగ్యంగా పుట్టింది. ఇప్పుడు తనకి మూడు సంవత్సరాలు. అంగన్వాడి కేంద్రంలో చదువుకోవడం వల్ల మా పాపకు కూడా ప్రతిరోజు పౌష్టికాహారం అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, పిల్లల పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన దేశ ప్రధాని మోడీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.