మచిలీపట్నం (సుల్తానగరం), నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం గురువారం బందరు మండలం సుల్తానగరం గ్రామం సుమ కన్వెన్షన్ లో జిల్లా అధికార యంత్రాంగం ఎంతో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత కేంద్ర సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్పయాత్ర డిజిటల్ ప్రచార వాహనానికి రాష్ట్ర గవర్నర్ పచ్చ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పియం ప్రణాo పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలు రాష్ట్ర గవర్నర్ జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ద్రోన్ ఫ్లై ద్వారా నానో ఎరువులు, పురుగు మందులు పంటలపై పిచికారి చేసే విధానం గవర్నర్కు వివరించారు.
అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు అర్హులైన ప్రజలందరికీ చేరవేయడం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. అర్హులై వుండి ఇంకా కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందని ప్రజల పట్ల ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో అందరూ వినియోగించుకునేలా చూడాలన్నారు.
అంతకు మునుపు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర పథకాల అమలులో ప్రజల సంతృప్తిని సాధించడానికి, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని పంచాయితీలు, నగర పంచాయతీలు, పట్టణ, స్థానిక సంస్థల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. అర్హులైనప్పటికి ప్రయోజనం పొందని బలహీనవర్గాలకు పథకాలు అందించడం, పథకాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం, పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి అనుభవాలను పంచుకొని, మరింతగా మెరుగుపరచడం, అర్హులైన లబ్ధిదారుల నమోదు ఈ యాత్ర ప్రధాన లక్ష్యం అన్నారు. నవంబర్ 25 తేదీ నుండి జనవరి 26 వరకు జిల్లాలోని 491 గ్రామాల్లో 60 రోజుల్లో మచిలీపట్నం నగరపాలక సంస్థతోపాటు గుడివాడ పెడన వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీలతోపాటు ఉయ్యూరు నగర పంచాయతీలో మొత్తం 11 ప్రదేశాల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్రను జిల్లాకు కేటాయించిన 5 ప్రచార వాహనాల ద్వారా కార్యక్రమాలు నిర్వహించేలా షెడ్యూలు రూట్ మ్యాప్ రూపొందించామన్నారు. కార్యక్రమాల నిర్వహణకు జిల్లా మండల గ్రామ స్థాయిలో అన్ని శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 17 కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందిన వివరాలు కలెక్టర్ తెలియజేశారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం వి ఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న పథకాలు మారుమూల గ్రామాల ప్రజలకు చేరేలా వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార వాహనాలు ద్వారా కృషి చేయాలన్నారు
రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి జి లక్ష్మీశా కేంద్ర పథకాల అమలు వివరించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
పర్యావరణహిత సేద్యాన్ని చేయడం ద్వారా భూమాతను ఎలా పరిరక్షించుకోవాలో బాలాజీ విద్యాలయం విద్యార్థినులు చక్కటి గేయ నృత్య ప్రదర్శన ద్వారా చైతన్య పరిచారు.
కళాజాత బృందం కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రదర్శించిన బుర్రకథ కళారూపం అందరినీ ఆకట్టుకుంది.
తొలుత బాలాజీ విద్యాలయం, లిటిల్ ఫ్లవర్ పాఠశాలల విద్యార్థినులు కూచిపూడి నృత్య సంప్రదాయంలో స్వాగత గేయ నృత్య ప్రదర్శనతో రాష్ట్ర గవర్నర్, ఆహుతులకు స్వాగతం పలికారు.
లబ్ధిదారుల అభిప్రాయాలు
ఎస్ ఎన్ గొల్లపాలెం గ్రామానికి చెందిన రమేష్ బాబు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 6000 రూపాయలు మూడు విడతల్లో పొందినట్లు, ఈ మొత్తాన్ని పంట సాగు పెట్టుబడిగా వినియోగించుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన పంచకర్ల నరసింహారావు తన తండ్రి కాలంలో తాటాకు ఇల్లు ఉండేదని పీఎంఏవై పథకం కింద 1.80 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీ లబ్ధి పొందానని, పక్కా ఇల్లు నిర్మించుకున్నట్లు తెలిపారు.తమకు ఈ సౌకర్యం కల్పించిన ప్రధాన మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం.
స్థానిక భాస్కరపురంకు చెందిన కీర్తి శాంతి అంగన్వాడి కేంద్రం ద్వారా పోషకాహారం తీసుకున్నట్లు, ఆరోగ్యంగా డెలివరీ అయ్యానని, తన పాపకు ప్రస్తుతం మూడు సంవత్సరాల వయస్సు అని, అంగన్వాడి ప్రీ స్కూల్లో చేర్పించినట్లు ప్రభుత్వం గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషకాహారం అందించే పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లు తెలిపారు.
రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా కేవలం సంప్రదాయ జీవన ఎరువులు వినియోగించి మంచి దిగుబడులు సాధిస్తున్న ఆదర్శ రైతు గణేశన రమేష్ బాబు( సుల్తానగరం)ను, స్వయం ఉపాధి కల్పించడంలో గుడివాడకు చెందిన ఆదర్శ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తోట మునెమ్మను,
జలజీవన్ మిషన్ క్రింద బంటుమిల్లి మండలం మలపరాజు గూడెం గ్రామంలో స్వచ్ఛమైన తాగునీటితో నూరు శాతం కుళాయి కనెక్షన్లు అందించినందుకు గ్రామ సర్పంచ్ దూసనపూడి అవతారం కు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మెమెంటోలు అందించారు.
తొలుత సమావేశంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రతిజ్ఞ చేయించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాలలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం అమలు గురించి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. జిల్లా పరిషత్ సీఈవో జ్యోతి బసు వందన సమర్పణ గావించారు.
జిల్లా ఎస్పీ పి జాషువా, డి ఆర్ ఓ పెద్ది రోజా, డి పివో నాగేశ్వర్ నాయక్, ఆర్డీవోలు ఎం వాణి, పద్మావతి, డ్వామా, డియార్డియే పిడిలు జి వి సూర్యనారాయణ , పి ఎస్.ఆర్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, కేడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News