గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బిఎల్ఓలు తమకు రోజువారీ అందే క్లైమ్స్ ఏరోజుకారోజే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పెండింగ్ క్లైమ్స్ 2 రోజుల్లో పరిష్కరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏఈఆర్ఓలు, సూపర్వైజరి అధికారులు, బిఎల్ఓలతో ఎన్నికల విధులు, శని, ఆదివారాల్లో జరిగే స్పెషల్ క్యాంపెయిన్ డేస్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా బిఎల్ఓలు తమకు క్షేత్ర స్థాయిలో అందే వివిధ ఫారాలను ఏరోజుకారోజు పరిష్కారం చేయాలని, క్లైమ్స్ పై ఎన్నికల విభాగం రోజువారీ నివేదిక ఇవ్వాలని సూపరిండెంట్లను ఆదేశించారు. ఇప్పటికి ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని 2 రోజుల్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. జనవరి 5 న వచ్చే తుది జాబితాలో ఏవిధమైన తప్పులు లేకుండా చూడడానికి ఇదే చివరి అవకాశమని, బిఎల్ఓలు తమకు కేటాయించిన ఓటర్ల లిస్టు భాద్యత తీసుకోవాలన్నారు. ప్రదానంగా నూతన ఓట్ల దరఖాస్తులను మరింత అప్రమత్తంగా పరిశీలన చేయాలని, అవసరమైతే సూపర్వైజరి అధికారులను క్షేత్ర స్థాయి పరిశీలనకు తీసుకెళ్లాలన్నారు. రాజకీయ పార్టీల నుండి అందిన ఫిర్యాదులని బిఎల్ఓ రిమార్క్స్ ద్వారా పరిష్కారం చేయాలన్నారు. అలాగే ఒకే డోర్ నంబర్ లో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే వాటిని సూపర్వైజరి అధికారులు తనిఖీ చేసి ఎన్నికల నిబందనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శని,ఆదివారాల్లో జరిగే స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ల్లో బిఎల్ఓలు విధిగా ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్ ల్లోనే అన్ని రకాల ఫారాలతో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బిఎల్ఓలు తప్పనిసరిగా బిఎల్ఓ రిజిస్టర్, ఓటర్ల లిస్టు కల్గి ఉండాలని తెలిపారు. అలాగే ఎన్నికల విధుల్లో ఎక్కడా కూడా వాలంటీర్లు ఇన్వాల్వ్ చేయకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో పశ్చిమ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివ జ్యోతి, ఏఈఆర్ఓలు, సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య, ప్రదీప్ కుమార్, కోటయ్య, మాస్టర్ ట్రైనర్లు వై.హరిహరనాద్, శ్రీకాంత్, సూపరిండెంట్లు సాంబశివరావు, పద్మ, ప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News