-61వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ పేదవాడు ఆనందంగా ఉండాలంటే మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 61 వ డివిజన్ 261వ వార్డు సచివాలయ పరిధి శాంతినగర్లో జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో మంగళవారం డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘన నివాళులర్పించి.. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం సచివాలయంలో సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో అభివృధ్దికి నోచుకోని కుటుంబాలు మన ప్రభుత్వంలో హాయిగా జీవించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుపై ఆశలు కల్పించారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి సంక్షేమ పథకాల ఒరవడిని మరింత పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని.. ఆ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా తామంతా పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రధానంగా రూ.84.35 లక్షలతో శాంతినగర్ ప్రధాన రహదారి నిర్మించుకున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. రూ. 69 లక్షలతో హెచ్ బ్లాక్ లో రహదారులు, రూ.93 లక్షలతో ప్రశాంతి నగర్లో నూతన రోడ్లను నిర్మించుకున్నట్లు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా విడుదలైన రూ. 80 లక్షలతో అనేక రహదారులకు మోక్షం లభించిందన్నారు. ఎలక్ట్రిసిటీ కాలనీలో రూ. 30 లక్షలు, ప్రగతినగర్లో రూ. 40 లక్షలతో సిమెంట్ రోడ్లను నిర్మించుకున్నట్లు పేర్కొన్నారు. గత తెలుగుదేశం హయాంలో పాయకాపురం చెరువు ఆక్రమణలకు గురికాగా.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 3.71 కోట్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది ప్రారంభించుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. హెచ్ బ్లాక్ లో రూ. 70 లక్షలతో స్థానికంగా నూతన సచివాలయ భవనాన్ని నిర్మించి ప్రారంభించుకోవడం ద్వారా.. ప్రజలకు పాలన మరింత చేరువైందన్నారు. 261 సచివాలయ పరిధిలో డిబిటీ ద్వారా ఇప్పటివరకు 9 కోట్ల 12 లక్షల 69 వేల 104 రూపాయల లబ్ధి చేకూర్చగా.. నాన్ డీబీటీ ద్వారా 6 కోట్ల 32 లక్షల 76 వేల 66 రూపాయల మేలు చేకూర్చడం జరిగిందన్నారు. మొత్తంగా రూ. 15.45 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మోహన్ బాబు, నాయకులు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News