Breaking News

లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరము

-లింగ నిర్ధారణకు ఎవరు సహకరించిన అటువంటి వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
-జిల్లాలో మాతృ మరణాలు శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి.
-జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భం ధరించడానికి ముందుగాని, గర్భం ధరించిన తర్వాత గాని పుట్టబోయే బిడ్డ లింగ ఎంపిక నిర్ధారణను ఎవరు సహకరించిన అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె .మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ” పిసిపిఎన్ డిటి యాక్ట్” , ఏ సిటీ, మాతృ మరణాలు, శిశు మరణాలు పై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా.మాధవీలత మాట్లాడుతూ చట్ట ప్రకారం లింగ నిర్ధారణ చేయు సామర్థ్యం ఉన్న ఏ యంత్ర పరికరాలను సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత గర్భిణీకి గాని, ఆమె బంధువులకు గానీ పుట్టబోయే బిడ్డ లింగ వివరాలను వెల్లడించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు మొదటి సారి ఉల్లంఘించిన వైద్యులు,నిపుణులు, ఇతరులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని అన్నారు. తదువరి అదే విధమైన ఉల్లంఘనకు పాల్పడే వారికి యాభై వేల రూపాయల జరిమానాతోబాటు ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసి వివరాలు చెప్పమని అడిగిన, అడగమని ప్రోత్సహించిన మరియు చెప్పిన వారికి మొదటి తప్పుకు చట్టప్రకారం 3 సం.లు జైలు శిక్ష మరియు 50 వేలు జరిమానా విధించడం జరుగు తుందని, మరల ఇదే నేరం చేసినట్లైతే 5 సం.లు జైలు శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా విధించబడుతుందని అన్నారు. వైద్యులు కూడా ఈ నేరాన్ని చేసినట్లు రుజువైతే వారి వైద్య పట్టా భారత వైద్య మండల్ నందు మొదటి తప్పుకు 5 సం.లు నిలిపివేయబడుతుందని, అదే తప్పు మరలా చేసినట్లయితే పూర్తిగా సర్టిఫికెట్ రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

అబార్షన్స్ ఎక్కువగా జరుగుతున్న ప్రైవేట్ హాస్పిటల్ గుర్తించి వాటిపై సమగ్ర విశ్లేషణ రిపోర్టు అందించాలని కోరారు. లింగ నిర్ధారణ కార్యక్రమాలకు పాల్పడుతున్న స్కానింగ్ కేంద్రం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ లేకుండా స్కానింగ్ సెంటర్లు నిర్వహించ రాదని స్కానింగ్ సెంటర్ల ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మరియు ఎక్కువగా ఉన్న మండలాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వివాహ వయస్సు పై గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి బాల్యవివాహాలను అరికట్టాలని తెలియజేశారు. రాజమండ్రి ఇన్నిసు పేట అర్బన్ ఏరియా ఆసుపత్రి పరిధిలో ఆడపిల్లల జనన సంఖ్య తక్కువగా నమోదు ఉందని ఇందుకు సంబంధి విచారణ చేసి నివేదిక అందజేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సంతాన సాఫల్య కేంద్రాలు 11 ఉన్నాయని, మరో 6 సెంటర్లకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో మాతృ మరణాలు శిశు మరణాలు సంభవించకుండా వైద్యాధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది పటిష్టమైన ముందస్తు ప్రణాళికతో గర్భం దాల్చిన నాటి నుంచి శిశువు జన్మించేంతవరకు మహిళలకు ముందస్తు సూచనలతో పాటు వైద్య సేవలు అందించాలన్నారు. మాతృ మరణాలు శిశు మరణాలు సంభవిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కే. వెంకటేశ్వర రావు , జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా . సనత్ కుమారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.రాజకుమారి, జిల్లా ఎంపీసీడీఎస్సార్  కమిటీ సభ్యులు , ప్రభుత్వ ఆసుపత్రి స్పెషలిస్ట్  వైద్యులు, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఉప జిల్లా వైద్యాధికారులు డా,.శ్రీహరి, డా సంధ్య  డా హరి చంద్ర ప్రసాద్ , డా మౌనిక , డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ జి.వసంత లక్ష్మి, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *