-సింహాచలంలో గిరి ప్రదక్షిణ , 32 కిలో మీటర్ల మేర జరిగే ఉత్సవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ పౌర్ణమి రోజున సింహాచలంలో గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించనున్నారు. సింహాచలంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ 32 కిలో మీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో కాలి నడకన చేరుకుంటారు.
గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేస్తుంది. జులై 20వ తేదీన సాయంత్రం 4.00 గంటలకు కొండ దిగువన తొలిపావంచా (కొండ ఎక్కే మొదటి మెట్టు) వద్ద నుంచి పుష్ప రథం ప్రారంభం అవుతుంది. జులై 21న తుది విడత చందన సమర్పణ జరుగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా జులై 20న రాత్రి 10.00 గంటల వరకు సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుంది. జులై 21న విజయోత్సవం పురస్కరించుకొని సాయంత్రం 4.00 గంటల వరకే శ్రీవరాహ లక్ష్మీనరసింహం దర్శనం ఉంటుంది.
గిరి ప్రదక్షిణ ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ధర్మకర్త , ఆలయ కార్యనిర్వహణాధికారి కొబ్బరికాయ కొట్టి , జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమాలు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. వివిధ కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4.00 గంటలకు శ్రీవరాహ లక్ష్మీనరసింహ దేవుని రథం లాగడంతో గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది. కొంత మంది భక్తులు ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు వేచి ఉంటారు. రథంతో పాటు నడిచి గిరి ప్రదక్షిణను పూర్తి చేస్తారు. అక్కడ నుంచి మెట్ల మార్గంలో సింహగిరి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులంతా పాదాల కొండ దగ్గర ఉన్న విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణ ప్రారంభిస్తారు. రథం ముందు చాలా మంది వాలంటీర్లు నృత్యం చేస్తారు.
గిరి ప్రదక్షిణ మార్గం
గిరి ప్రదక్షిణ రోజున పుష్ప రథం యాత్ర వెనుక లక్షలాది మంది ప్రజలు నడుస్తారు. 32 కిలో మీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణ విశాఖపట్నం ప్రధాన ప్రాంతాల్లో సాగుతోంది. ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు , కర్ణాటక , ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పాల్గొంటారు. గిరి ప్రదక్షిణ సింహాచలం కొండ పాదాల వద్ద ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి జైలు రోడ్డు మీదుగా అడవివరం , ఆరిలోవ , హనుమంతవాక , జోడుగుళ్ల పాలెం బీచ్ , మాధవధార , ఎన్‌ఏడీ జంక్షన్ , గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం ఆలయానికి చేరుకుంటుంది. అయితే పుష్ప రథం యాత్ర రూట్ కూడా దాదాపుగా అదే ఉంటుంది. అయితే కాలినడక గిరి ప్రదక్షిణ మార్గానికి , రథం మార్గానికి చిన్న తేడా ఉంటుంది. బీచ్ రోడ్డు వైపు రథం వెళ్లదు. అయితే సింహాచలం కొండ పాదాల నుంచి జైలు రోడ్డు మీదుగా అడవివరం , ఆరిలోవ , హనుమంతవాక నుంచి జాతీయ రహదారి (ఎన్‌హెచ్) 5 మీదుగా ఎన్‌డీఏ జంక్షన్ , గోపాలపట్నం నుంచి తిరిగి సింహాచలం చేరుకుంటుంది. రథం వెంట ఉండే మొదటి బ్యాచ్ మాత్రం , రథం వెళ్లే మార్గం వైపే వెళ్తుంది. అయితే ఆ తరువాత మార్గనిర్దేశం చేసేవారు ఎవరు ఉండకపోవడంతో జనాలు రద్దీ భారీగా పెరగడంతో అప్పుడు రూటు మారిపోయి , బీచ్ రోడ్డు వైపు వెళ్తుంది.
భక్తులకు ఏర్పాట్లు
భక్తుల సౌకర్యార్థం సింహాచలం కొండ చుట్టూ 30 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. 275 మొబైల్ టాయిలెట్స్, కొండ చుట్టూ విద్యుత్ దీపాలు అలంకరణ , మంచినీటి సదుపాయం , సామియానాలు , పెండళ్లు , కుర్చీల ఏర్పాటు , వైద్య శిబిరాలు , పారిశుధ్యం , పోలీసు భద్రత , జోడిగుళ్లపాలెం బీచ్ వద్ద గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచడం వంటి ఏర్పాట్లు చేస్తారు. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తమ సేవలను అందిస్తాయి. పులిహార , పెరుగు అన్నం కూడా మార్గమధ్యలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తాయి. మజ్జిగ , వాటర్ ప్యాకెట్లు , టీ తదితర పానీయాలు కూడా అందజేస్తారు. అలాగే కాళ్లు నొప్పులు రాకుండా మూలిక నూనె రాస్తారు.
జులై 20 , 21 తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు
గిరి ప్రదక్షిణ సందర్భంగా జులై 20 , 21వ తేదీల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. జులై 20న ఉదయం గిరి ప్రదక్షిణ ప్రారంభించి , రాత్రికే తిరిగి సింహాచలం చేరుకునే భక్తుల సౌకర్యార్థం ఆ రోజు రాత్రి 10.00 గంటలకు వరకు దర్శనాలు అందిస్తారు. అలాగే 21న తెల్లవారుజాము నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. స్వామివారి ఆర్జిత సేవలు మాత్రం ఉండవని సింహాచలం దేవస్థానం స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ తెలిపారు.
ఏర్పాట్లపై ఈవో సమీక్ష
జులై 20న ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని సింహాచలం కొండ చుట్టూ జరిగిన గిరి ప్రదక్షిణలో ఏర్పాట్లకు సంబంధించి సింహాచలం దేవస్థానం ఈవో సిగాల శ్రీనివాసమూర్తి సమీక్షించారు. దేవస్థాన వైదికులు , ఇంజినీరింగ్ అధికారులు, వివిధ విభాగాల అధికారులతో చర్చించారు. జీవీఎంసీ , పోలీస్ , మెడికల్ తదితర విభాగాల అధికారులకు లేఖలు రాయాలని అధికారులను ఈవో ఆదేశించారు.