విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశను మిగిల్చిందని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదని.. ఏపీకి మరోసారి మొండిచేయే మిగిలిందని విమర్శించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి కేవలం రూ. 15 వేల కోట్లు మాత్రమే ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అది కూడా సాయంగా కాకుండా అప్పుగా ఇప్పిస్తామంటూ చెప్పడం విడ్డూరమన్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యులై ఉంటూ రాష్ట్రానికి నిధులు రప్పించడంలో అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందారని మల్లాది విష్ణు ఆరోపించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఎక్కడా ఏపీకి సంబంధించి నిర్దిష్టమైన ప్రకటనలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఊసే లేదని.. విభజన హామీల ప్రస్తావన లేకపోవడం రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు.
Prajavartha Online Telugu News