-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినిల ఆరోగ్యం, భద్రత పరంగా నిరంతరం సేవలు అందిస్తున్న ఏఎన్ఎంలు విద్యార్థులకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ అని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు కొనియాడారు. బుధవారం సమగ్ర శిక్షా, ఎయిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో కేజీబీవీల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్ఎంలకు ఐదు విడతలుగా మూడు రోజుల పాటు శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఎయిమ్స్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టర్ ప్రొ. డా. మాధబనంద కర్ (Prof. Dr Madhabananda Kar), కేజీబీవీ సెక్రటరీ డి. మధుసూదనరావు, కేజీబీవీ, ఎయిమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… కేజీబీవీల్లో ప్రతి విద్యార్థినికి పౌష్టికాహార లోపం ఏర్పడకుండా రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు అధిగమించేలా సకాలంలో మందులు అందించడంలో ముందుండాలని కోరారు. విద్యార్థినులు మానసికంగా ఇబ్బంది గురవుతున్నారంటే ముందుగానే పసిగట్టి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. విద్యార్థినిలకు ఆరోగ్యం బాగాలేకపోతే అత్యవసరమైతే సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికైనా తీసుకెళ్లడంలో చొరవ చూపాలి, విద్యార్థినిలకు సురక్షిత తాగునీరు, దోమల భారీ నుండి రక్షణ కల్పించడంలో ప్రిన్సిపల్ కు సమాచారమివ్వాలన్నారు. అనంతరం ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టర్ ప్రొ. డా. మాధబనంద కర్ ప్రసంగిస్తూ ఇలాంటి కార్యక్రమాలు విద్యాశాఖ,సమగ్ర శిక్షా తరఫున నిర్వహించడం సంతోషం, కేజీబీవీ విద్యార్థినిలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని సూచించారు.