-అసమర్థ ప్రధాని మోదీపై పొగడ్తలా?
-రాష్ట్రంలో భూముల అన్యాక్రాంతంపై విచారణ జరిపించండి
-ఆర్థిక పరిస్థితి, జరుగుతున్న పరిణామాలపై అఖిలపక్షం ఏర్పాటు చేయండి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశాన్ని అన్ని రంగాల్లో దివాళా తీయించిన అసమర్ధుడైన ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల మోదీ కష్టాన్ని శ్రమను నేడు దేశం వినియోగించుకుంటుందంటూ పొగడటాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
స్థానిక దాసరి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజతో కలిసి ఆయన మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు మోదీని అభినందిస్తూ దేశం అభివృద్ధి చెందుతున్నట్లు ప్రపంచంలో గుర్తింపు వచ్చిందని, ఆర్థికంగా ఇతర దేశాలతో పోటీ పడుతున్నామని, జాతీ ముందుకు పొతుందంటూ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వ్యవసాయ ప్రధానమైన దేశంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ పదేళ్లలో లక్షా ఇరవై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులు అప్పులపాలై పదే పదే రోడ్డులపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. నిరుద్యోగం 45ఏళ్ల రికార్డు స్థాయిలో పెరిగిందని బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని పేర్కొన్నారు. దేశంలో 40 శాతం మంది పట్టభద్రులకు ఉద్యోగాలు లేవని, ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా కేవలం 20.9 శాతం మందికి మాత్రమే సక్రమంగా జీతాలు అందుతున్నాయన్నారు. మోదీ దేశంలో మౌలిక సమస్యలను పరిష్కరించలేదని, ధరలు తగ్గించలేదని, నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేదని గుర్తు చేశారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఢల్లీి సీఎం కేజ్రీవాల్‌ను, గతంలో జార్ఖండ్ సీఎం హిమంత్ సొరెన్‌ను జైల్లో పెట్టారని, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారని, ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పేదరికంలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోనే తాను సీనియర్ రాజకీయ నాయకుడని పదేపదే చెపుతున్న చంద్రబాబు పదేళ్లలో దేశం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, నితీష్‌కుమార్ వంటి సీనియర్ నేతల వల్లే దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో వీరిద్దరూ మోదీతో జతకట్టి మూడోసారి మోదీని ప్రధానిని చేశారన్నారు. చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తూ రాష్ట్రానికి రూ.9,74,000 కోట్లు అప్పు ఉందని ప్రకటించారన్నారు. టీడీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలో 14లక్షల కోట్లు అప్పుందన్నారు. ఈ రెండు లెక్కలతో విభేదిస్తూ జగన్ రాష్ట్రానికి రూ.7,48,000 కోట్లు ఉందని ప్రకటించారన్నారు. వైసీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మరో లెక్క చెప్పారని వీటిన్నింటితో రాష్ట్ర ప్రజలు గందరగోళానికి గురైయ్యారని పేర్కొన్నారు. కేంద్రం అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇచ్చిందా? రుణంగా ఇచ్చిందా? అనేది స్పష్టత లేదన్నారు. గ్రాంట్‌గా ఇవ్వాలని మోదీని చంద్రబాబు అగడలేకపోతున్నారని చెప్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాకికి ఏమి ఇస్తారో కేంద్రం చెప్పలేదన్నారు. ఈ అంశాలపై సీనియర్ పాత్రికేయులు, ఆర్థిక వేత్తలు తడబడుతున్నారని చెప్పారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించటానికి మోదీ గ్యారెంటీ అవసరం లేదని ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోగల సామర్ధ్యం చంద్రబాబుకు ఉందన్నారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి, జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన మీడియా ముఖంగా వాస్తవాలు వెల్లడిరచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూ మాఫియా వేళ్లూనుకుందన్నారు. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దహనం చేయటం, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీలు అక్కడకు వెళ్లంతో ప్రాధాన్యత వచ్చిందన్నారు. మదనపల్లెలో వెయ్యి ఎకరాల పేదల భూములు అక్రమణకు గురైయ్యాయని చెప్పారు. బద్వేలులో 30 వేల ఎకరాల భూములను వైసీపీ నాయకులు కబ్జా చేశారన్నారు. భూ దందాలకు వ్యతిరేకంగా బద్వేలులో సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో ధర్నా చేయటం జరిగిందన్నారు. వైఎస్సార్ జిల్లాలో లక్షా ఇరవై వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, అన్యాక్రాంతమైన భూములు, భూ దందాలపై సీనియర్ ఐఏఎస్ అధికారితో సమగ్ర విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 31వ తేదిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ వద్దను భూ అక్రమాల వివరాలను అందించనున్నట్లు వివరించారు.
Prajavartha Online Telugu News