-ముఖ్యమంత్రి ఆదేశాలతో పరిహారం అందించిన స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
-విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి చొరవతో వారంలోపే బాధితులకు అందిన పరిహారం
-ఇటీవల విద్యుత్ షాకుతో ముగ్గురు యువకులు మృత్యువాత
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కనిగిరి పునుగోడులో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చొరవతో ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందించింది. ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చెక్కులు అందించారు. గత నెల 23వ తేదీన బాలాజీ, షేక్ నజీర్ ఖాన్, వీరమాచి గౌతమ్ కుమార్ లు విద్యుత్ షాక్ తో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తాను అని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఘటన జరిగిన వారం రోజుల్లోనే ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందేలా కృషి చేశారు. రాష్ట్రంలోని ఎక్కడైనా విద్యుత్ షాక్ కు గురై మరణించి ఉంటే ఆ బాధిత కుటుంబాలకు కూడా సాధ్యమైనంత త్వరగా పరిహారం అందేలా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి అధికారులకు సూచించారు.