Breaking News

ఈ-పంటలో పంట డిజిట‌ల్ రికార్డింగ్‌

-10 ల‌క్ష‌ల మందికి కౌలు రైతు గుర్తింపు కార్డులిస్తున్నాం
-రాబోయే 5 ఏళ్ల‌లో 20ల‌క్ష‌ల హెక్టార్ల‌లో ప్ర‌కృతి సేద్యం
-క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో వ్య‌వ‌సాయ‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజ‌శేఖ‌ర్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ-పంట న‌మోదు కార్య‌క్ర‌మంపై క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో వ్య‌వ‌సాయ‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి. రాజ‌శేఖ‌ర్ సూచించారు. ఈ-పంట న‌మోదులో ఈ సారి నేరుగా రైతులు సాగు చేస్తున్న పొలం వ‌ద్ద‌కే వ‌చ్చి వారు సాగు చేస్తున్న పంట‌ను డిజిట‌ల్ రికార్డింగు చేస్తున్నామ‌ని తెలిపారు. దీనివ‌ల్ల నిజంగా పొలంపైన సాగు చేస్తున్న రైతుకు ల‌బ్ది చేకూరుతుంద‌న్నారు. కౌలు రైతుల‌కు ల‌బ్ది చేకూరేలా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా నిర్వ‌హించే బాధ్య‌త జిల్లా క‌లెక్ట‌ర్ల‌పైనే ఉంద‌ని చెప్పారు. ఈ-పంట డిజిట‌ల్ రికార్డింగు వ‌ల్ల 90 శాతం కౌలు రైతుల‌కు ల‌బ్ది చేకూరే అవ‌కాశ‌ముంద‌న్నారు. 10ల‌క్ష‌ల మంది కౌలు రైతుల‌కు గుర్తింపు కార్డులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌స్తున్న వాతావ‌ర‌ణ మార్పులు వ్య‌వ‌సాయ‌రంగానికి ప్ర‌తికూలంగా మార‌తున్నాయ‌ని చెప్పారు. కొన్ని చోట్ల రైతులు కేవ‌లం ఒకే పంట‌కు ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని అలాంటి రైతుల‌ను గుర్తించి వారిని రెండు, మూడు పంట‌లు వేసే దిశ‌గా ప్రోత్స‌హించాల‌న్నారు. ఇప్ప‌టికీ రాష్ట్రంలో 62 శాతం మంది వ్య‌వ‌సాయంపైన ఆధార‌ప‌డుతున్నార‌ని వివ‌రించారు. గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో వ్య‌వ‌సాయ‌రంగం ఆశాజ‌నకంగా లేద‌ని, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తి ప‌డిపోయింద‌ని, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తి శాతం పెరిగేలా చేయడంలో జిల్లాలో క‌లెక్ట‌ర్లు కీల‌క పాత్ర పోషించాల‌ని సూచంచారు. ఆయా జిల్లాల్లో పంట‌ల సాగు విస్తీర్ణం పెంచ‌డానికి ఏం చేయాలి, ఉత్ప‌త్తులు ఎలా పెంచాలి అనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. ఆ జిల్లాలో లేదా ఇత‌ర ప్రాంతాల్లో కొంత‌మంది రైతులు ఆచ‌రిస్తున్న మంచి వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తుల‌ను గుర్తించి వాటిని మిగిలిన రైతులూ పాటించేలా చేయాల‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌కృతి సేద్యాన్ని బాగా ప్రోత్స‌హించాల‌ని ముఖ్య‌మంత్రి ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని, ప్ర‌కృతి సాగును ప్రోత్స‌హించే చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్లు దృష్టి పెట్టాల‌న్నారు. రాబోయే ఐదు సంవ‌త్స‌రాల్లో 20 ల‌క్ష‌ల హెక్టార్ల‌ను ప్ర‌కృతి సేద్యంలోకి తీసుకురావాల‌నేది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. రాష్ట్రంలో స‌హ‌కార‌బ్యాంకులో పూర్తి స్థాయి ఆన్‌లైన్ సేవ‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని చెప్పారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *