-రాబోయే 3 నెలల్లో 4,500 పడవలకు ఏర్పాటు
-కలెక్టర్ల సదస్సులో మత్సశాఖ కార్యదర్శి బాబు ఏ.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్యకారులకు ఉపయోగపడేలా చేపలవేటకు ఉపయోగించే పడవలకు శాటిలైట్ కమ్యూనికేషన్, ట్రాకింగ్ డివైజ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మత్స్యశాఖ కార్యదర్శి బాబు, ఏ తెలిపారు. మత్సశాఖ నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి ఆయన సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వివరించారు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో సహకారంతో వారి పడవలకు శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల మత్స్యకారులకు చేపలు ఏ ప్రాంతంలో ఉన్నాయి అనే సమాచారం ముందుగానే తెలిసే వీలు కలిగి చేపల వేట మరింత సులభతరమవుతుందన్నారు. చేపల వేటకు వెళ్లిన పడవ ఎక్కడ ఉంది, ఏ మార్గంలో వెళ్లింది కూడా తెలస్తుందని, విపత్తుల సమయంలో ఇది వారికి మరింత ఉపయోగపడుతుందన్నారు. రాబోయే 3 నెలల్లో 4,500 పడవలకు ఈ డివైజ్‌ను ఏర్పాటు చేసి, మిగిలిన వాటికి దశలవారీగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేపల ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఈ రంగంలో 15 శాతం వృద్ది సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించబోతున్నామని వాటి నిర్మాణ పనులపైనా జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలని కోరారు. బాపట్లలో ఆక్వా పార్కు, పులికాట్ సరస్సులో రాయదరువు వద్ద సీ మౌత్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.