Breaking News

సెప్టెంబర్ మొదటి వారం నుండి రెవిన్యూ సదస్సులు

-ఉద్యోగుల బదిలీల కారణంగా వాయిదా
-నిజమైన అసైనీలకు న్యాయం చేసేందుకే భూముల రిజిస్ర్టేషన్లు నిలిపివేత
-రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో నిర్ణయించినట్లుగా రెవిన్యూ సదస్సులను ఈ నెల 16 నుండి కాకుండా వాయిదా వేస్తూ సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నిజానికి రెవిన్యూ సదస్సులను ఈ నెల 15 వ తేదీన లాంచనంగా ప్రారంభించి, 16 వ తేదీ నుండి నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. అయితే చిత్తుశుద్దితో ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పనిచేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి అయిన తదుపరి ఈ రెవిన్యూ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే పాత అధికారులతోనే ఈ సదస్సులను నిర్వహిస్తే సరైన ఫలితాలు రావని, ప్రజలకు న్యాయం జరగదని ప్రభుత్వం బావిస్తూ ఉద్యోగల బదిలీల ప్రక్రియ పూర్తి అయిన తదుపరి కొత్త అధికారులతో ఈ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ సదస్సుల్లో భాగంగా మొదటి 45 రోజుల పాటు భూ వివాదాలు, రీ-సర్వేలో జరిగిన తప్పిదాలకు సంబందించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, తదుపరి 45 రోజుల్లో అర్జీలపై తగు చర్యలు తీసుకుంటూ రెవిన్యూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ రెవిన్యూ సదస్సులను పకడ్బందీగా, పటిష్టంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిని నోడల్ అధికారిగా నియమించడంతో పాటు ఆయా జిల్లాల్లోని మంత్రులు, అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో అస్సైన్డు భూముల విషయంలో ఎన్నో అవకతవకలు, మోసపూరితమైన రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయన్నారు. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ ఆధారంగా మోసపూరితమైన ఆధారాలతో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. గతంలో ఈ విధంగా జరిగిన మోసపూరిత రిజస్ట్రేషన్లపై పూర్తి స్థాయిలో అధ్యయనం, విచారణ జరిపి నిజమైన ఎస్సైనీలకు ఎటు వంటి అన్యాయం జరుగకుండా, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలలపాటు నిలుపుదల చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిషేదిత భూముల చట్టంలోని 22(ఎ) జాబితాను కూడా పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేయడం, ఎన్నో అవకవతకలకు పాల్పడటం జరిగిందన్నారు. ఒక్కొక్క కేసును అధ్యయనం చేసి బాదితులకు న్యాయం చేసే విధంగా వాటన్నింటినీ క్రమబద్దీకరించాలనే లక్ష్యంతోనే మూడు మాసాలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో ఇనాం భూములు, ఎస్టేట్ భూములు, తిరుపతిలోని మఠం భూములు కూడా రకరకాలుగా కబ్జాలకు గురి అయ్యాయని, రికార్డులు కూడా తారుమారు అయ్యాయన్నారు. వీటన్నింటి పై పూర్తి స్థాయిలో అధ్యయం చేసి బాదితులకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అదే విధంగా అగ్రిగోల్డు భూముల వివాదం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆ భూముల రిజిస్ట్రేషన్లు ఎట్టి పరిస్థితిలోనూ జరగడానికి వీల్లేదు అన్నారు. అయితే అక్కడున్న అధికారుల తప్పిదాల వల్ల అగ్రిగోల్డు భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఈ విషయంలో న్యాయస్థానమే తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *