-ఆర్బీఐ డైరెక్టర్ సతీష్ కె.మరాఠే
-సహకారభూమి జర్నల్ కార్యాలయ సందర్శన
-వైకుంఠ మెహతా చిత్రపటం ఆవిష్కరణ
-సహకార సంఘాల సభ్యులతో ఇష్టాగోష్టి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో సహకార వ్యవస్థ ఆశించిన రీతిలో అభివృద్ధి చెందడం లేదనీ, దీనికి ఒకే ఒక్క ప్రధాన కారణం సహకార చట్టమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డైరెక్టర్, సహకార భారతి పూర్వ అధ్యక్షులు సతీష్ కె.మరాఠే అన్నారు. సహకార భారతి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యాన ఓ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన.. సహకారభూమి జర్నల్ సహకార సంఘం కార్యాలయాన్ని బుధవారం ఉదయం సందర్శించారు. తొలుత ప్రఖ్యాత సహకారవాది వైకుంఠ మెహతా చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సహకార పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సహకారభూమి, నగరంలోని వివిధ సొసైటీల సభ్యులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. దేశంలో సహకార చట్టాన్ని సరళీకృతం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని గుర్తుచేశారు. అయితే, దానికి అనుగుణంగా వివిధ కారణాల వల్ల తర్వాత అభివృద్ధి జరగలేదనేది వేరే విషయమన్నారు. ఇక్కడ మాత్రమే కాదనీ, దేశమంతా ఇదే పరిస్థితి నెలకొని వుందన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా వున్న కాలంలోనూ సహకార చట్టాలను సరళీకృతం చేశారనీ, అవి నేటికీ అమలులో వున్నాయని చెప్పారు. సహకారం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కనుక రాష్ట్రాలు తమ చట్టాల్లో సవరణలు చేసి, సంస్కరణలు తేనంతకాలం సహకార వ్యవస్థ అభివృద్ధి అసాధ్యమని స్పష్టం చేశారు. సహకార విధానాన్ని రూపొందించడానికి కేంద్రం నియమించిన కమిటీలో తానొక సభ్యుడినని, సహకార వ్యవస్థను ప్రత్యేకంగా కాపాడుకోవాలని తాము సిఫార్సు చేస్తున్నామన్నారు. సహకార వ్యవస్థ అభివృద్ధి చెందితే దానితోపాటు మరో మూడు ప్రధాన రంగాలు కూడా ప్రగతి సాధిస్తాయన్నారు. వ్యవసాయం, తయారీ పరిశ్రమ, సేవల రంగం వీటిలో ప్రధానమైనవన్నారు. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టి, స్వల్పకాలిక రుణాలు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం మాత్రమే ఆరోగ్యకర విధానం కాబోదన్నారు. జాతీయ అభివృద్ధికి ఆ ఒక్క చర్య మాత్రమే ఉపయోగపడదనీ, మనం మరో ప్రయోజనం కూడా సాధించాల్సి వుందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహకార చట్టాల సవరణపై దృష్టిపెట్టాలని సూచించారు. అప్పుడే జాతీయ అభివృద్ధిలో ముఖ్యమైన సాధనంగా సహకార వ్యవస్థ రూపొందుతుందన్నారు. సహకార సంఘాలే స్వయానా సహకార కంపెనీలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)ని నూరు శాతం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ తరుణంలో పెట్టుబడి లేకుండా అభివృద్ధి చెందడం అసాధ్యమనీ, అందువల్ల పెట్టుబడిదారుల సహకారం తీసుకోక తప్పదన్నారు. ఆ రకంగా సహకార సంఘాలు మూలధనం సమకూర్చుకోవాల్సిందేనని, వాస్తవానికి విదేశాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారనీ తెలిపారు. యూరప్, అమెరికాలోనూ ఇదే జరుగుతోందన్నారు. భారత అభివృద్ధిలో సహకార సంఘాలు అర్థవంతమైన ప్రధాన పాత్ర పోషించాలంటే.. సహకార చట్టాలు మార్చుకోవటంతో పాటు, పెట్టుబడిదారుల సహకారం పొందటం అవశ్యమని చెప్పారు. ‘ఒక వ్యక్తి – ఒక ఓటు’ అనే విధానంలో మనం మార్పు చేసుకోనంతకాలం ఇదంతా సాధించడం అసాధ్యమన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో కూడా సవరణలు చేసిందన్నారు. దీనిద్వారా సహకార సంస్థలు పెట్టుబడిదారుల సహకారం పొందే వీలు కలుగుతుందన్నారు. దీనికి అనుగుణమైన విధానాలు రూపొందించాల్సిందిగా తాను కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ని కోరుతున్నట్టు ఆర్బీఐ డైరెక్టర్ సతీష్ కె.మరాఠే వివరించారు. తాను చెప్పిన నాలుగు మాటలు ఓపికగా సహనంతో విన్నందుకు, తనను ఇక్కడికి ఆహ్వానించి సత్కరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.