గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎందరో ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నస్వేచ్చ, స్వాతంత్ర్యమని, దేశం కోసం వారు చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఎంఎల్సీ కెఎస్.లక్ష్మణరావు, నగరపాలక సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో, జిన్నా టవర్ సెంటర్, యన్.టి.ఆర్ స్టేడియంలో జెండా ఆవిష్కరణ చేసి, ఎన్.సి.సి. విద్యార్ధుల పెరేడ్ తిలకించి, గౌరవ వందనం స్వీకరించి, విధుల్లో ప్రతిభ కనబరచిన నగర పాలకసంస్థ ఉద్యోగులకు, ప్రజారోగ్య క కార్మికులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. హిమని సెంటర్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, బ్రిటీష్ పాలన నుండి విముక్తికై ఎంతోమంది దేశ భక్తులు పోరాడి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసువులు బాశారన్నారు. నేటికి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయ్యిందని, ఈ రోజును భారత దేశంలోని ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటారని తెలియచేశారు. ముఖ్యంగా నేటి యువత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నిత్యం స్మరిచుకోవాలని తెలియచేశారు. గుంటూరు నగరంలో కూడా కుల,మత, పార్టీలకు అతీతంగా షుమారు రూ.4 వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. త్వరలో పివికె నాయుడు మార్కెట్ ని కూడా అధునాతన విధానంలో నిర్మాణం చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే నగరంలో ప్రదాన రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేశామని, స్వచ్చ సర్వేక్షణ్, వాయు సర్వేక్షణ్ లో జాతీయ స్థాయిలో గుంటూరు ఖ్యాతిని చాటామని తెలిపారు. అమృత్ పధకం ద్వారా పార్క్ లు, చెరువులు అభివృద్ధి చేశామని తెలిపారు. మెరుగైన వైద్య సేవల కోసం నూతనంగా 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలను నిర్మాణం చేశామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎంఎల్ఏలు, కేంద్ర సహాయ మంత్రివర్యులతో సమన్వయం చేసుకుంటూ గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ది పధంలో తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.
కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతి ఒక్కరూ కల్గి ఉండాలని, మన స్వేచ్చాయుత జీవనానికి ఎందరో ప్రాణ త్యాగాలనే విషయాన్నినేటి యువతకు తెలియచేయాలన్నారు. యువత దేశ భక్తుల అడుగు జాడల్లో నడుస్తూ, వారి ఆశయాలకు సాధనకు కృషి చేస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఎంఎల్సీ కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం రావడానికి ఎందరో త్యాగాలు చేశారని, ప్రస్తుతం మనం వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వ్యక్తిగతంగా దేశానికి మనం ఏమి చేశామో ఆలోచించుకోవాలన్నారు. ప్రతి ఇంటిలో తల్లిదండ్రులు తమ పిల్లలకు దేశభక్తుల గూర్చి తెలియచేయాన్నారు.
అనంతరం గుంటూరు నగర పాలక సంస్థలో విధులు నిర్వహిస్తూ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు, ప్రజారోగ్య కార్మికులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, డి.వెంకట లక్ష్మీ, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎస్.ఈ. ఎం.శ్యాం సుందర్, ఎంహెచ్ఓ మధుసూదన్, ఈ.ఈ. సుందర్రామిరెడ్డి, ఏడిహెచ్ రామారావు, మేనేజర్ ప్రసాద్, డిఈఈ మహ్మద్ రఫిక్, ఎన్సీసి అధికారి ప్రభాకర్, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు తదితరలు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …