-సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం
-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు అశేష జనం పాల్గొని బ్రిటీష్ వారిని తరిమికొట్టారని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి నేతలు ప్రాణాలను తృణప్రాయంగా భావించారని కొనియాడారు. 1925లో సీపీఐ ఆవిర్భవించి స్వాతంత్రోద్యమంలో వివిధ వర్గాల ప్రజలను సమీకరించి పోరాటంలో పాల్గొందన్నారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న పార్టీగా సీపీఐ నిలవడం గర్వంగా ఉందన్నారు. స్వాతంత్రోద్యమంలో ఏ మాత్రం పాల్గొనని వారు అధికారం చేపట్టి చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. 1920లో దేశంలోని అభ్యుదయవాదులు ఏఐటీయూసీని ఏర్పాటు చేసి, స్వాతంత్ర సంగ్రామంలో కార్మికులను పోరాటంలో పాల్గొనేలా చేశారని తెలిపారు. 1936లో విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులను, ఏఐకేఎస్‌ను ఏర్పాటు చేసి రైతులను, కవులు, రచయితలను సమీకరించి ఇప్టాను ఏర్పాటు చేసి వారితో రచనలు చేయించటం, కళాకారులను సమీకరించి ప్రజానాట్య మండలి ద్వారా కళారూపాలను ప్రదర్శించటం ఇలా అన్ని వర్గాల వారిని స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా చేశారని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఆవిర్భవించినా అది ముస్లింలకు, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టిందన్నారు. మహాత్మగాంధీని కించపరుస్తూ, జవహర్‌లాల్ నెహ్రూను తక్కువ చేసి చూపించిందని చెప్పారు. ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని త్యాగాలు చేశారో వారిని స్మరించుకుంటూ స్వాతంత్ర ఫలాలను అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత సీపీఐకు ఉందన్నారు. దేశంలో 40 కోట్ల మంది పేద ప్రజలు ఉన్నారని చెప్పారు. నిరుద్యోగం, అధిక ధరలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబాయిలో ఉన్న అంబానీ, అదాని ప్రపంచ కుబేరులుగా ఎదుగుతున్నారని అదే ప్రాంతంలో పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. పేదరికంలో ప్రపంచంలో భారతదేశం మొదటిస్థానంలో ఉందన్నారు. 143 కోట్ల మంది జనాభాలో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్దులు, పార్శీలు వంటి వివిధ మతాలు, కులాల వారు కలిసి ఉండటానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం అన్నారు. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ బెంగాల్లో వైద్యురాలని అత్యంత కిరాతకంగా హత్య చేయటం, నాలుగేళ్ల పసిపాపను చంపటం చూస్తుంటే మహిళలకు ఇంకా స్వాతంత్రం రాలేదని స్పష్టం అవుతుందన్నారు. మహిళా సాధికారతపై పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.జాన్సన్ బాబు మాట్లాడుతూ స్వాతంత్రం సాధించటమే లక్ష్యంగా ఏఐఎస్‌ఎఫ్ స్వాతంత్రోద్యమంలో పాల్గొందన్నారు. అనేక మంది విద్యార్థులు ప్రాణాలు అర్పించారని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నూతన విద్యావిధానం తీసుకువచ్చి విద్యను కాషాయికరణ చేస్తుందన్నారు. స్వాతంత్ర పోరాటంలో ప్రాణ త్యాగం చేసిన అనేక మంది మహనీయుల త్యాగాలను పాఠ్యాంశాల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ప్రొఫెసర్ సి. నరసింహారావు, సిపిఐ రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అధ్యక్షులు పి చంద్ర నాయక్, కోశాధికారి ఆర్. పిచ్చయ్య నాయకులు ఎస్కే నజీర్లు దేశభక్తి గీతాలు ఆలపించారు.
Prajavartha Online Telugu News