గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ లో వాహనాల నిర్వహణ పక్కాగా ఉండాలని, మరమత్తులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కెవిపి కాలనీలోని వెహికిల్ షెడ్ ని ఆకస్మిక తనిఖీ చేసి, షెడ్ లోని వాహనాలు, ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నవి, మరమత్తులకు గురైనవి, కార్మికులు హాజరు తదితర వివరాలు ఏఈ, డిఈఈలను అడిగి సంబందిత రిజిస్టర్ లను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పారిశుధ్య నిర్వహణలో చెత్త తరలింపు వాహనాలు సకాలంలో అందుబాటులో లేకుంటే పారిశుధ్యం సక్రమంగా ఉండదన్నారు. వెహికిల్ షెడ్ నుండి ఆయా వాహనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా షెడ్ అధికారులు భాధ్యత తీసుకోవాలన్నారు. వాహనాల మరమత్తు చేపట్టిన వివరాలతో కూడిన రిపోర్ట్ ఇవ్వాలని ఏఈ నియా ఆదేశించారు. కొన్ని వాహనాలు నెలల తరబడి మరమత్తులు పూర్తి కాకుండా షెడ్, మెకానిక్ షెడ్ లో ఉండడంపై అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసి, రోజుల తరబడి మరమత్తులపై కధలు చెప్పవద్దని, 2 రోజుల్లో పూర్తి కావాల్సిందేనన్నారు. నూతన వాహనాల మరమత్తులపై ఆయా కంపెనీల నుండి వారంటి మేరకు చేయించాలన్నారు. వాహనాల వారీగా మరమత్తులపై టైం లైన్ ఇవ్వాలని డిఈని ఆదేశించారు. ఏఈ, డిఈఈలు సోమవారం ఈ-ఆటోల మరమత్తులు, నిర్వహణపై స్వచ్చాంధ్ర కార్పోరేషన్ అధికారులతో చర్చించాలన్నారు. షెడ్ లో డ్రైవర్లు, పర్యవేక్షణ అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రజారోగ్య నిర్వహణలో వ్యర్ధాల తరలింపు ఎంతో ప్రధానమైన అంశమని, అత్యవసరం అయితే తప్ప ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెడితే చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్లు, సిబ్బంది హాజరు ప్రతి రోజు ఎఫ్ఆర్ఎస్ ద్వారా తీసుకోవాలన్నారు. వెహికిల్ షెడ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, వాహనాలు వరుస క్రమంలో ఉంచాలన్నారు. షెడ్ లో వినియోగానికి అనువుగా లేని, వ్యాలిడిటి గడువు ముగిసిన వాహనాలకు ప్రభుత్వ నిబందనల మేరకు ఆక్షన్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పర్యటనలో డిఈఈ సతీష్, ఏఈ రవి కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నం పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …