విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ లోని వరద ముంపు ప్రాంతాలను కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు , ఎంపి కేశినేని శివనాథ్ మంగళవారం పర్యటించారు. సింగ్ నగర్ బ్రిడ్జ్ పై నడుస్తూ బ్రిడ్జ్ కింద నీట మునిగిన ప్రాంత పరిస్థితులు కేంద్రమంత్రి రామ్మోహన్ కు ఎంపి కేశినేని శివనాథ్ వివరించారు. అలాగే వరద నీటిలో నడుస్తూ సహాయక చర్యలు పరిశీలించారు. బాధితులు కంగారుపడొద్దని, ధైర్యంగా వుండాలని, ప్రభుత్వం బాధితుల్ని రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్, ఎంపి కేశినేని శివనాథ్ డాబా కోట్ల సెంటర్ నుంచి నందమూరి నగర్ సాయిబాబా గుడి వరకు ట్రాక్టర్ పై వెళ్లి నీట మునిగిన ప్రాంతాలను, జరుగుతున్న సహాయక చర్యలను గమనించి అవసరమైన సూచనలు అధికారులకి అందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడిందని మరింత వేగంగా సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు. స్వచ్చందంగా వరద బాధితులకి సాయం చేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు టిప్పర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులకి, వరద బాధితులకి ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు.
Prajavartha Online Telugu News