-స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు
-మెడికల్ క్యాంపుల నిర్వహణలో ప్రధమ స్దానం
-స్వచ్ఛంధ బాగస్వామ్యంలో ద్వితీయ స్దానం మన సొంతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా దూసుకుపోతుందని స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మానేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈనెల 17వ తేదీన పక్షం రోజుల కార్యక్రమంగా దేశ వ్యాప్తంగా దీనిని ఘనంగా ప్రారంభించగా, రాష్ట్రంలో స్వచ్చత పట్టణాలు, గ్రామలే ధ్యేయంగా చేపడుతున్న పనులు దేశంలోనే రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాయన్నారు. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్చత” ఇతివృత్తంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ఇక్కడి 123 పురపాలక సంఘాలు, అన్నీ గ్రామీణ ప్రాంతాలలో ఏకకాలంలో ప్రారంభించామన్నారు. సఫాయి మిత్ర సురక్ష కార్యక్రమంలో భాగంగా పారిశుద్య కార్మికుల కోసం ఆంధ్ర ప్రదేశ్ లో 76,730 మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేయగా, ఈ సంఖ్య దేశంలోనే పెద్దదిగా నిలిచిందన్నారు. ఈ విభాగంలో ఇప్పటి వరకు రాష్ట్రం ప్రధమ స్దానంలో కొనసాగుతున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృవీకరించిందన్నారు. తరువాతి స్ధానాలలో వరుసగా తమిళనాడు (58,817), బీహార్ (42,415), మహారాష్ట్ర (29611), గుజరాత్ (20,808) మెడికల్ క్యాంపులతో నిలిచాయన్నారు. ప్రజలు స్వచ్చంధంగా కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న విభాగంలో సైతం ఆంధ్రప్రదశ్ రెండో స్దానాన్ని దక్కించుకుందన్నారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలకు ప్రత్యేకించి యువత, విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలివస్తుండటం, స్వచ్చత పట్ల వారి నిబద్దత చాటుతుందని గంధం చంద్రుడు తెలియజేశారు, ఆంధ్రప్రదేశ్ నుండి 25,82,348 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా మన రాష్ట్రం ద్వితీయ స్దానంలో నిలిచిందని, ప్రధమస్ధానాన్ని 29,32,465 మందితో గుజరాత్ దక్కించుకుందన్నారు. 11,72,411 మందితో ఓడిస్సా, 10,87,297 మందితో మహారాష్ట్ర, 10,76,922 మంది భాగస్వామ్యంతో గుజరాత్ వరుసగా నిలిచియన్నారు. అక్టోబరు రెండవతేదీ గాంధీ జయంతితో కార్యక్రమం ముగియనుండగా, మరిన్ని రికార్డులు సాధించగలమన్న అశాభావాన్ని గంధం చంద్రుడు వ్యక్త పరిచారు.
Prajavartha Online Telugu News