Breaking News

వరద నిధుల దుబారాపై మల్లాది విష్ణు మండిపాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులు పూర్తిగా కోలుకునేలా చేయూతనందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. దాతల నుంచి చెక్కుల సేకరణకు కేటాయించిన సమయంలో సగం సమయం కూడా సహాయక చర్యలపై పెట్టకపోవడంతో.. 16 డివిజన్లు పూర్తిగా నీటమునిగాయన్నారు. చివరకు ఎన్యుమరేషన్లో లోపాల కారణంగా ప్రతి సచివాలయ పరిధిలో సగానికి పైగా బాధితులు సాయం అందక మిగిలిపోయింది వాస్తవం కాదా..? అని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత వల్ల నేటికీ వీరంతా కలెక్టరేట్ చుట్టూ, వార్డు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారని.. కేంద్రం ఇచ్చిన రూ. 1,036 కోట్ల నిధులు ఏమైనట్లు..? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజల ఆకలి, ఆక్రందన తీర్చే విధంగా ప్రభుత్వం పనిచేయాలి తప్ప వరద నిధులను దుబారా చేయటానికి కాదని మండిపడ్డారు. మరోవైపు వరదల పేరిట వందల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్లను దోచిపెట్టిందని మల్లాది విష్ణు ఆరోపించారు. మానవత్వంతో దాతలు అందించిన సహాయంలోనూ అంతులేని అవినీతి జరిగిందన్నారు. మొదటి ఐదారు రోజులు బాధితుల దగ్గరకే వెళ్లలేకపోయారని.. అలాంటప్పుడు ఆహారానికి ఏకంగా రూ. 368 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సహాయ శిబిరాలు ఏర్పాటు చేయకుండానే టెంపరరీ అకామిడేషన్ పేరుతో రూ. 1 కోటీ 45 లక్షలు దోచుకుతిన్నారని ధ్వజమెత్తారు. శానిటేషన్ కు రూ. 52 కోట్లు ఖర్చు చేశామని చెప్పటమే తప్ప.. పారిశుద్ధ్య కార్మికులకు కనీసం భోజనాలు, అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. చాలా చోట్ల నేటికీ వ్యర్థాలు తొలగించలేదని.. అధికారులు క్షేతస్థాయిలో పర్యటిస్తే పరిస్థితి అర్ధమవుతుందన్నారు. మరోవైపు 10 రోజుల పాటు గాఢాంధకారంలో ప్రజలు మగ్గిపోతే.. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెల పేరిట రూ. 23 కోట్లు ఖర్చు చూపడం హాస్యాస్పదమన్నారు. ఇవిగాక డ్రోన్ల పేరిట నొక్కేసింది మరో రూ. 2 కోట్లు అని.. ఇలా దోచుకునేందుకు ఉన్న అడ్డదారులన్నీ ఉపయోగించారన్నారు. చివరకు దాతలు అందించిన రూ. వందల కోట్ల సాయమంతా.. తెలుగుదేశం కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరిందన్నారు. ఇదేనా వరద సాయమంటే..? అసలు దాతలు అందించిన మొత్తం సాయమెంత..? ప్రజాధనానికి లెక్కలు చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై లేదా..? అని సూటిగా ప్రశ్నించారు. వరదల పేరిట ఖర్చు చేసిన ప్రతిఒక్క రూపాయికి ఈ ప్రభుత్వం లెక్కలు చెప్పాలని.. ప్రజలలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. అలాగే ఎన్యుమరేషన్ ప్రక్రియను మరలా పకడ్బందీగా చేపట్టి బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *