-ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఆరు నూతన పాలసీలు తీసుకొచ్చాం
-వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే నినాదంతో ముందుకెళతాం
-రాష్ట్రంలో ఐదు జోన్లలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు
-10 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయం
-ఏపీ బ్రాండ్ ఇమేజీని గత ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసింది
-సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు
-20 ఉద్యోగాల కల్పన, గంజాయి-డ్రగ్స్ నివారణ, ధరల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంగం ఏర్పాటు
-స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
-మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఆరు నూతన పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆరు కొత్త పబ్లిక్ పాలసీల గురించి వివరించారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ-ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0, ప్లగ్ అండ్ ప్లే’ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 4.0, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 అనే పాలసీలను జాబ్‌ఫస్ట్ అనే ఆశయంతో తీసుకొచ్చామన్నారు. రాష్ట్రాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ పాలసీలు రూపొందించామన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ (ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ అనేది తమ నినాదమన్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలన్నదే తమ ఆశయమన్నారు. ఈ ఆరు పాలసీలు రాష్ట్ర ప్రగతినే మార్చేస్తాయని ఇది ఒక గేమ్ ఛేంజర్ అన్నారు. గతంలో ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనే దృక్పథంతో వెళ్లేవాళ్లమని, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారనే ధృక్ఫథంతో ముందుకెళుతున్నామన్నారు. ఇంకా ఏమన్నారంటే…
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
విలువలతో కూడిన వ్యాపారం చేయడం ద్వారా వ్యాపార సామ్రాజ్యం సృష్టించవచ్చు అని చెప్పడానికి రతన్ టాటా ఒక ఉదాహరణ. ఆయన తన తెలివితేటలు, నిజాయతీతో 28 కంపెనీలు స్థాపించారు. 400 బిలియన్ డాలర్ల వ్యాపారం చేశారు, తన వ్యాపార సామ్రాజ్యాన్ని వంద దేశాలకు విస్తరించగడలడం చాలా గొప్ప విషయం. ఆయన పేరిట రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిలో ఒక ప్రధాన ఇన్నోవేషన్ హబ్ ఉంటుంది, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నిటికీ ఉపయోగకరంగా ఉండేలా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం ఐదు జోన్లలో కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా రతన్ టాటా పేరు మీదే ఉంటాయి. ఇవన్నీ నాలెడ్జ్ హబ్‌లుగా ఉంటాయి. గత ప్రభుత్వం తీరు వల్ల మన రాష్ట్రానికున్న బ్రాండ్ ఇమేజ్ మొత్తం పాడైపోయింది. దాన్ని మళ్లీ పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి ఏపీని ఆక్వా కల్చర్ హబ్‌గా తయారు చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం. రాబోయే రోజుల్లో రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. రాష్ట్రాన్ని గ్లోబల్లీ అట్రాక్టివ్ మానుఫ్యాక్చరింగ్ హబ్, గ్రీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతాం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175కి పైగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తాం.
ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0
పరిశ్రమలు స్థాపించే వారిని ప్రోత్సహించేలా భారత దేశంలోనే ఒక బెస్ట్ పాలసీని రూపొందించాం. కంపెనీలు స్థాపించేవారు పెట్టే మూలధన పెట్టుబడిలో 75 శాతం ఇన్సెంటివ్స్‌గా ఇస్తున్నాం. అలాగే రాయితీలు కూడా వారు ఇచ్చే ఉద్యోగాలను బట్టి ఉండేలా రూపొందించాం. జాబ్ ఫస్ట్ అనేది మా మొట్టమొదటి ప్రాధాన్యం. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే ఆశయంతో చేపట్టిన పాలసీ ఇది. ఎంఎస్ఎంఈలకు రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉండే ఎంఎస్ఎంఈలన్నిటికి కూడా నేషనల్ పోర్టల్ పెడతాం. వీకర్ సెక్షన్‌లకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం.
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0
ఎంఎస్ఎంఈలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. 3 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నాం. వేస్ట్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తాం. కోల్డ్ చైన్ లింక్ ఏర్పాటు చేస్తాం. రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక రాయితీలిస్తాం. ఈ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ
రూ.84వేల కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చాం. 10 ఎకరాలలో నానో పార్క్స్, 10-100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, 100-1000 ఎకరాల్లో లార్జ్ పార్కులు, 1000కి పైగా ఎకరాల్లో మెగా పార్కుల నిర్మాణం చేపడతాం. పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ముందు మౌలిక సదుపాయాలుండాలి. ప్రస్తుతం నాలుగు ఇండస్ట్రియల్ పార్కులున్నాయి. ఇప్పుడు ఈ పాలసీలో నాలుగు విధాలుగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేలా తీసుకొచ్చాం. నానో పార్కులు, ఎంఎస్ ఎంఈ, లార్జి పార్కులు, మెగా పార్కులు ఏర్పాటు చేసుకునే విధానం తీసుకొచ్చాం.
ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 4.0
రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.50 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించాం. 5000 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. బినామీలకు చోటు లేకుండా నిజమైన పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పిస్తాం. సింగిల్ విండో క్లియరన్స్ ఇస్తాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ డ్రీమ్డ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. ప్రపంచంలోనే ఏపీని గ్రీన్- గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.
మల్లవల్లిలో ఎంఎస్ఎంఈలకు న్యాయం చేస్తాం
మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కు, ఇదో విషాధభరితమైన సంఘటన. 35 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా నాడు ఒక పాలసీ తీసుకొచ్చాం. 1,360 ఎకరాల్లో ఎంఎస్ఎంఈలు పెట్టేలా పరిశ్రమలు పెట్టేవారికి గతంలో ఎకరా రూ.16.50 లక్షలకు ఇచ్చాం. గత ప్రభుత్వం ఆ భూమి రేటును రూ.89.16 లక్షలు చేసింది. వాళ్లను వేధింపులకు గురి చేసింది. వాళ్లలో చాలా మంది కోర్టులకు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ నాడు పరిశ్రమలు స్థాపించడానికి వచ్చిన 349 మందికి గతంలో వారికి కేటాయించి ఎకరా రూ.16.50 లక్షల ధరకే భూమిని కేటాయిస్తున్నాం. అయితే వారు ఆరు నెలల్లో పనులు మొదలు పెట్టాలి. రెండేళ్లలో ప్రాజెక్టును కంప్లీట్ చేయాలి.
లోకేష్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం సాధించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దీనికి ఛైర్మన్ గా ఉంటారు, మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవి, కందుల దుర్గేశ్, కొండపల్లి శ్రీనివాస్, పి.నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. అలాగే స్వర్ణకారుల కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం.
గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తాం
రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేస్తాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బాధితులకు పునరావాసం లాంటి అంశాలు అధ్యయనం చేసేందుకు మంత్రి వంగలపూడి అనిత ఛైర్ పర్సన్‌గా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో చాలా వరకు నేరాల వెనక గంజాయి బ్యాచ్ ఎక్కువగా ఉంటోంది. వాళ్లను ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు. అవసరమైతే అలాంటి వాళ్లను సంఘ విద్రోహులుగా ప్రకటించేలా చర్యలు తీసుకుంటాం. రౌడీషీట్లు తెరచి పోలీసు స్టేషన్లలో వారి ఫొటోలు పెట్టి, వారిని విదేశాలకు వెళ్లనివ్వకుండా చేస్తాం. గంజాయి, డ్రగ్స్‌తో నేరాలకు పాల్పడేవారిని సంఘ బహిష్కరణ కూడా చేసేలా చర్యలు తీసుకుంటాం.
అక్రమ మద్యం వ్యాపారం చేస్తే ఉపేక్షించం
రాష్ట్రంలో డ్రగ్స్, అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించం. ఏ పార్టీ వాళ్లనైనా సరే ఈ విషయంలో వదలిపెట్టం. అందరూ ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానాన్ని అనుసరించాల్సిందే. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు. గత ప్రభుత్వం చేసినవన్నీ చెత్త పనులు. వాళ్లు రాష్ట్రంలో కనీసం చెత్తను కూడా శుభ్రం చేయకుండా వదిలేసి వెళ్లిపోయారు. చెత్తమీద పన్ను వేసి, రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త శుభ్రం తొలగించకుండా అలాగే వదిలేసి పోయారు. మళ్లీ ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదు. వాళ్లు చేసిన చెత్త పన్నును రద్దు చేస్తున్నాం. వీళ్లు తొలగించకుండా వదిలేసి వెళ్లిన చెత్తను తొలగించాలంటే రూ.వెయ్యి నుంచి రెండు వేల కోట్లు ఖర్చు అవుతోంది.
రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు
వైసీపీ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. రథాన్ని తగలబెడతారు, మళ్లీ నాటకాలు ఆడతారు. బుద్ధి జ్ఞానం ఉండాలి. అలాంటి సంఘటనలను ఖండండిచి క్షమాపణలు చెప్పాల్సిందిపోయి మళ్లీ సిగ్గు లేకుండా విమర్శలు చేస్తారా.? సీసీ కెమెరాల్లో వారి బండారం బయటపడింది. రాష్ట్రంలో 14 వేల కెమెరాలున్నాయి. కనీసం వాటిని గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఉపయోగించుకోలేదు అంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అంత దారుణంగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. పంటలపైన అప్పుడప్పుడు అడవి పందులు పడుతుంటాయి…అవి పంట తిని వెళ్లవు, వెళుతూ వెళుతూ ఆ పంట మొత్తాన్ని సర్వ నాశనం చేసి వెళుతుంటాయి. ఆ తరహాలో వీళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.
గుంతలు కూడా పూడ్చలేదు
గత ప్రభుత్వం కనీసం రోడ్లపై పడిన గుంతలు కూడా పూడ్చలేదు. పంచాయతీ రోడ్లకు సంబంధించి జవాబుదారీ తనం లేకుండా టెండర్లు వేశారు. పనులు చేయకుండా నిధులు తినేశారు. కనీసం ఆ ఫైళ్లు కూడా కనిపించడం లేదు. రహదారులపై ఉన్న గుంతలను రూ.600 కోట్లతో పూడ్చేస్తున్నాం. సంక్రాంతి తరువాత రాష్ట్రంలో గుంతల రహిత రహదార్లు కనిపించేలా చేస్తున్నాం.
ఉచిత ఇసుక విధానంలో రాజకీయ జోక్యం ఉండదు
ఇసుక విధానంలో ఎలాంటి రాజకీయ జోక్యాన్ని సహించబోను. ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. జిల్లాకు ఒక మంత్రిని ప్లానింగ్ బోర్డు ఛైర్మన్‌గా వేశాం. ఆ జిల్లాలో ఇసుక ఉచితంగా లభించేలా చూడాల్సిన బాధ్యత వాళ్లదే. ఎడ్లబండి, ట్రాక్టరు తీసుకొచ్చి ఎవరైనా ఇసుకు తీసుకుని వెళుతుంటే వాళ్లపైన అనవసరంగా కేసులు పెట్టొద్దు. అలా కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. ప్రజలు వాళ్లు నివసిస్తున్న ఊళ్లో ఉన్న ఏట్లో వాళ్లకు కావాల్సిన ఇసుక తీసుకునే స్వేచ్ఛ లేకపోతే ఎలా.? ఎవరైతే ఇసుక స్వయంగా అక్కడికి వెళ్లి తెచ్చుకోలేకపోతున్నారో వారికి ఫెసిలిటేటర్లుగా మాత్రమే కలెక్టర్లు, అధికారులుండాలి.
మింగిందంతా కక్కిస్తాం
గత ప్రభుత్వంలో ఇసుక ఇష్టానుసారం అమ్మేసుకున్నారు. గత ఐదేళ్లలో ఎవరైనా స్వేచ్ఛగా ఎక్కడైనా వాగులు, నది వద్దకు వచ్చి ఇసుక తీసుకెళ్లే పరిస్థితి ఉందా.? అంత అరాచకమా, అంత అహంభావమా. ప్రజాస్వామమ్యంలో కనీసం ఈ అన్యాయాన్ని అడిగే పరిస్థితి లేకపోయింది. ఐదేళ్లలో నాకే ప్రశ్నించే అవకాశం లేకుండా చేశారు. ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రశ్నించిన వాళ్లకు మనం జవాబుదారీ తనంతో సమాధానం చెప్పాలి. అలాంటి పరిస్థితి కల్పించారా వీళ్లు.? అని సీఎం ధ్వజమెత్తారు.
Prajavartha Online Telugu News