-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న విదేశీ విద్యాదీవెన బకాయిలను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పెట్టిన రూ. 1,778 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేసిందని.. అంతేగానీ కక్ష సాధింపులతో విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కానీ విదేశీ విద్యా దీవెన పథకానికి కూటమి ప్రభుత్వం పాతరేస్తోందని ఈ సందర్భంగా ఆరోపించారు. టీడీపీ హయాంలో ఊరూ పేరు లేని, అసలు ఉన్నాయో లేవో తెలియని యూనివర్సిటీలకూ విదేశీ విద్యాదీవెన పథకాన్ని వర్తింపజేసి దోచుకున్నారని మండిపడ్డారు. ఐ-20 ఫాం సమర్పిస్తే చాలు.. వారు చదువుతున్నారా..? లేదా..? అన్న విషయాన్ని కూడా గతంలో పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. కోర్సులను మధ్యలోనే మానేసిన వారు, ఒక కోర్సులో చేరి మరో కోర్సుకు బదిలీ అయిన వారు, ఒక యూనివర్సిటీ నుంచి చదువులు పూర్తి చేయకుండా మరో చోటకు వెళ్లిన వారు.. ఇలా టీడీపీ ప్రభుత్వంలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయన్నారు. పైగా 2016-17 కి సంబంధించి 3,326 మందికి రూ. 318 కోట్ల బకాయిలు పెట్టి వదిలేశారని దుయ్యబట్టారు.
వైసీపీ హయాంలో పారదర్శకంగా పథకం అమలు
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలకు అడ్డుకట్ట వేసి.. నిబంధనలను సడలించారని మల్లాది విష్ణు అన్నారు. గతంలో కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ.6 లక్షలు కాగా, జగన్ ప్రభుత్వంలో రూ.8 లక్షలకు పెంచారన్నారు. కొన్ని దేశాల్లోని విద్యాసంస్థలకు మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం పరిమితం చేస్తే.. జగనన్న ప్రభుత్వం 21 కోర్సుల్లో టాప్ 50 యూనివర్శిటీలకు సంబంధించి ఏ దేశానికి వెళ్లి చదివినా పథకాన్ని వర్తింపజేశారన్నారు. టీడీపీ హయాంలో సగటున ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేదని.. కానీ జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన వారికి రూ.కోటి వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందించిందని తెలిపారు. లంచాలు, వివక్షకు తావు లేకుండా పేద విద్యార్థులకు విదేశీ విద్యను చేరువ చేసి.. 408 మంది విద్యార్థులకు అక్షరాల రూ.107 కోట్లు అందించినట్లు తెలియజేశారు.
పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు
2014-19 మధ్య కాలంలో ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకానికి రూ.32.71 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారిని పక్కనపెట్టడం సరికాదని మల్లాది విష్ణు అన్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి బకాయిలు విడుదల చేసి.. ప్రస్తుతం చదువుకుంటూ ఇబ్బంది పడుతున్న వారిని నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు. ఈ ప్రభుత్వానికి పోలవరం సందర్శన బస్సులు, భోజనాలు, నీరు-చెట్టు నిధులు విడుదల చేయడంపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల భవిష్యత్తుపై లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంథా మార్చుకోవాలని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే.. వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News