Breaking News

ఉల్లాస్ అక్ష‌రాస్య‌తా కార్య‌క్ర‌మంపై దృష్టిపెట్టండి

-ప‌థ‌కం అమ‌లుకు అధికారులు ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయండి
-జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌దిహేనేళ్ల‌కు పైబ‌డిన వారిలో నిర‌క్ష‌రాస్యుల‌ను గుర్తించి.. వారిని అక్ష‌రాస్యులుగా తీర్చిదిద్ద‌డంతో పాటు ఆర్థిక అక్ష‌రాస్య‌త‌, డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త పెంపొందించేందుకు ఉద్దేశించిన ఉల్లాస్ (అండ‌ర్‌స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫ‌ర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్య‌క్ర‌మం అమ‌లుపై అధికారులు ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా ఆదేశించారు.
శుక్ర‌వారం సాయంత్రం జాయింట్ క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఉల్లాస్ కార్య‌క్ర‌మం అమ‌లుపై నిధి మీనా.. పాఠ‌శాల విద్య‌, వ‌యోజ‌న‌విద్య‌, డీఆర్‌డీఏ, గ్రామ-వార్డు స‌చివాల‌యాలు, ఐసీడీఎస్‌; స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఉల్లాస్ కార్య‌క్ర‌మం అమ‌లుపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేకంగా దృష్టిసారించాయ‌ని, ప‌థ‌కం ల‌క్ష్యాల సాధ‌న‌కు అధికారులు కృషిచేయాల‌ని సూచించారు. నిర‌క్ష‌రాస్యులైన స్వ‌యం స‌హాయ‌క సంఘాల స‌భ్యులతో పాటు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని ఆయాలు, కుక్‌లు, హెల్ప‌ర్లు, నైట్ వాచ్‌మ్యాన్లు, అంగ‌న్వాడీ స‌హాయ‌కులు త‌దిత‌రులను గుర్తించి అక్ష‌రాస్యులుగా తీర్చిదిద్దాల్సి ఉంద‌న్నారు. ఇందుకు జిల్లాస్థాయిలో క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న‌, మండ‌ల స్థాయిలో ఎంపీడీవో ఛైర్మ‌న్‌గా క‌మిటీలు ప‌నిచేస్తాయ‌న్నారు. వ‌యోజ‌న విద్యా శాఖ ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మం మూడేళ్ల‌పాటు జ‌రుగుతుంద‌ని, తొలిద‌శ‌లో జిల్లాలో ఏడువేల మంది ల‌బ్ధిదారుల‌ను గుర్తించి, అక్ష‌రాస్యులుగా తీర్చిదిద్ద‌నున్న‌ట్లు తెలిపారు. తొలుత విలేజ్ ఆర్గ‌నైజేష‌న్ అసిస్టెంట్ (వీవోఏ), క్ల‌స్ట‌ర్ కోఆర్డినేటర్ల ద్వారా స‌మ‌గ్ర స‌ర్వే జ‌రిపి ల‌బ్ధిదారుల‌ను గుర్తించాల‌ని సూచించారు. అదే విధంగా ప్ర‌తి ప‌దిమందికి ఒక వాలంటీర్ టీచ‌ర్‌ను గుర్తించాల్సి ఉంద‌న్నారు. అనంత‌రం జిల్లాస్థాయిలో, మండ‌ల‌స్థాయిలో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని, న‌వంబ‌ర్ నుంచి సాయంత్రం స‌మ‌యంలో రెండు గంట‌ల పాటు త‌ర‌గ‌తుల నిర్వ‌హణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. త‌ర‌గ‌తులు పూర్త‌యిన త‌ర్వాత ఎన్ఐవోఎస్/ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌థ‌కం అమ‌ల్లో ప్ర‌తిభ‌చూపిన వారికి త‌గిన గుర్తింపు కూడా ఉంటుంద‌న్నారు. స‌మాజ శ్రేయ‌స్సు ల‌క్ష్యంగా అమ‌ల‌వుతున్న ఈ కార్య‌క్ర‌మంలో ఉద్యోగులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, సామాజిక కార్య‌క‌ర్త‌లు, యువ‌త త‌దిత‌రులు భాగ‌స్వాములు కావాల‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో ఉల్లాస్ కార్య‌క్ర‌మ నోడ‌ల్ అధికారి జి.ప్ర‌సాద్‌రావు, ఏపీవో ఎం.సింగ‌య్య‌, డీఈవో యూవీ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డీపీఆర్‌వో ఎస్‌వీ మోహ‌న‌రావు; గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *