-ఆక్వారంగం అభివృద్ది పై ప్రభుత్వానికి నివేధించడంలో అధికారులు విఫలమైతే రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడను…
-జాతీయ మత్స్య రైతు దినోత్సవం సందర్బంగా మత్స్య సాగు చేసే రైతులకు శుభాకాంక్షలు…
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కైకలూరు ప్రాంత మత్స్య రైతాంగానికి కావలసిన అవసరాలను క్రమమార్గం ద్వారా ప్రభుత్వానికి నివేదించడంలో అధికారులు, గత ప్రభుత్వాలలోని ఈ ప్రాంత నాయకులు విఫలం అయ్యారని,ఇప్పటికైనా ఈ ప్రాంత మత్స్య రైతుల అవసరాలను ప్రభుత్వానికి నివేదించకపోతే అధికారుల తీరు పట్ల నిరసనగా కైకలూరు నడిబొడ్డులో నిరాహారదీక్ష, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావుఅన్నారు.
శనివారం స్థానిక మత్స్య కార్యాలయంలో జాతీయ మత్స్య రైతు దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన మత్స్య రైతుల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆక్వా రైతు సోదరులకు అందరికి మత్స్య రైతు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన రాష్ట్రంలో అత్యధిక ఆక్వా కల్చర్ సాగు కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలోనే ఉండటం చాలా సంతోషకరం అన్నారు. కైకలూరు ప్రాంతంలో 1975 లో జలగం వెంగళరావు హయాంలో ఇక్కడ మత్స్య పరిశ్రమకు పునాదులు పడ్డాయని, అప్పటి నుంచి గత నాలుగున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మత్స్య సాగు జరుగుతూ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చిందన్నారు. అయితే ఈ ప్రాంత రైతులకు ప్రభుత్వ పరంగా కల్పించవలసిన మౌలిక సదుపాయాల కల్పన లో ఈ ప్రాంత అధికారులు అయితేనేమి, ప్రజా ప్రతినిధులు అయితేనేమి కృషి చేసిన దాఖలాలు మచ్చుకు కానరాలేదని ఆయన అన్నారు. కేవలం తమ స్వార్ధం తప్ప అన్యుల కోసం ఆలోచించి రైతాంగానికి చేతనయినంత ప్రయోజనం చేద్దామనే తపన లేని నాయకులే వల్లే నేడు ఈ పరిస్థితి కి కారణ మన్నారు. దీనిమూలంగానే మన ప్రాంతానికి రావలసిన, కావలసిన అనేక సంస్థలు, ఇతర ప్రాంతాలకు అక్కడి నాయకుల పనితనం మూలంగా తరలిపోయాయని అన్నారు. కైకలూరు ప్రాంతంలో ఆక్వారంగంలో సన్న,చిన్న కారు రైతులు ఎక్కువగా ఉన్నారని, ముఖ్యంగా ఆక్వా రైతుకు కావలసినది మేలైన(స్పాన్) హేచరీ అని, సీడు నాణ్యతతో పాటుగా ధర కూడా తక్కువగా ఉండి ఎక్కువ దిగుబడి సాధించడానికి ఇది తోడ్పడుతుందన్నారు. ఈ ప్రాంత ఆక్వా సోదరులు సౌకర్యాల లేమితో అనేక ఆటుపోట్లను తట్టుకొని సాగు చేస్తున్నారని, సరియైన హేచరీస్ లేక నాణ్యమైన చేపపిల్లలు దొరకక రైతులు నష్టాల ఊబిలో సాగు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డిగారిని కైకలూరు నియోజకవర్గానికి ఫిషరీస్ పాలిటెక్నిక్ తో పాటుగా 50 ఎకరాలలో హేచరీ కావాలని కోరడం జరిగిందన్నారు.సీయం తక్షణమే స్పందించి కైకలూరు డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి. ఫిషరీస్ 30 సీట్లతో మంజూరుకు ఆదేశించారని, అలాగే హేచరీ మంజూరుకు చర్యలు తీసుకొని వలసినదిగా సంబంధిత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శివారిని ఆదేశించారని అన్నారు. దరిమిలా తిరుపతి శ్రీ వేంకటేశ్వర వెటరినరీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వారు గత జూన్ 1 వ తేదీన కైకలూరు లో ఫిషరీస్ పాలిటెక్నిక్ నిర్మాణం కోసం 50 ఎకరాల స్థలం గుర్తించవలసిందిగా ఆదేశించియున్నారని అన్నారు. ఇది జరిగి 40 రోజులు కావస్తున్నా అధికారులు దీనిపై ఎట్టి ప్రయత్నం చేయలేదని, ఇది చాలా విచారకరం అన్నారు. తాను గత నాయకుల మాదిరి కాదని, ఈ ప్రాంత ప్రజలకు కావలసిన సౌకర్యాలు ప్రభుత్వ పరంగా కల్పించడానికి నిరంతరం పనిచేయవలసిన అవసరం ఒక బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా తనపై ఉందన్నారు.తాను నాయకుణ్ణి కాదని, ప్రజలకు సేవకుణ్ణి అని అన్నారు. ప్రస్తుతం రాజన్న రాజ్యంలోజగనన్న పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రైతన్య రాజ్యం నడుస్తున్న ఈ తరుణంలో రైతుల మొహంలో చెరగని చిరునవ్వు ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ముఖ్యంగా సన్న చిన్న కారు రైతులకు ఇప్పుడు మేలు జరుగకపోయితే ఇంకెప్పుడూ జరగదని అన్నారు.ఇక్కడి రైతులకు మేలు చేసే అంశాలు కావలసిన మౌలిక సదుపాయాల గురించి ఇక్కడి ప్రజా ప్రతినిధిగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా ఇక్కడి అధికారులు గా మీరు ప్రభుత్వానికి నివేదించడం లో విఫలం అయ్యారని నేను భావిస్తున్నానని అన్నారు. ఆక్వారంగంలో కేంద్రబిందువుగా ఉన్న మన ప్రాంతంలో రైతుకు ప్రభుత్వ పరంగా ఒక హేచరీ కూడా లేకపోవడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వం తరపున మంచి హేచరీ ఉండి నాణ్యమైన సీడు లభ్యమైనప్పుడే రైతులు మేలైన దిగుబడిని సాధించి లాభాల బాట పడతారని ఆయన అన్నారు.
కైకలూరు ప్రాంత ఆక్వా రైతాంగానికి ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడానికి,రైతుల జీవన ప్రమాణాలు మరింత మెరుగు పడడానికి అవసరమైన సదుపాయాల కల్పనకు అధికారులు ఇప్పటికైనా తగిన ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి వెంటనే నివేదించక పోతే తాను అధికారుల తీరుకు నిరసనగా ప్రత్యక్ష నిరసనకు దిగి కైకలూరు నడిబొడ్డులో నిరాహార దీక్ష అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడానికి వెనుకాడనని తనకు తన ప్రాంత రైతుల శ్రేయస్సు ముఖ్యమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్బంగా పలువురు మత్స్యరైతులను సన్మానించారు.
కార్యక్రమంలో మత్స్య శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు లాల్ మహ్మద్, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు చింతా గోవిందరాజులు, కైకలూరు ఫిషరీస్ ఏడీ ప్రతిభ ల్యాబ్ ఏడీ ఎల్బీఎస్ వర్ధన్, మచిలీపట్నం ఏడీ ఎన్.వెంకటేశ్వరరెడ్డి, ఆక్వారైతులు మంగినేని పోతురాజు,బొడ్డు నోబుల్,చందన ఉమామహేశ్వరరావు,వడ్లాని పార్ధసారధి, జక్కా శివాజీ,బావిశెట్టి పాము,నున్న భగవాన్, వడ్లాని శేఖర్,తదితరులు పాల్గొన్నారు.