-నగరంలో శ్రమదానం కార్యక్రమం చేపట్టిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రమదానం కార్యక్రమం ద్వారా మచిలీపట్నం నగరాన్ని స్వచ్ఛ బందరుగా తీర్చిదిద్దడానికి ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మంత్రి కూటమి నాయకులు, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్థానిక పంపులు చెరువు పరిసర ప్రాంతాలలో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. మూడు స్తంభాల సెంటర్ నుంచి పాత పంపుల చెరువు గట్టుమీద పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలతో అల్లుకుపోయిన చెరువుగట్టును వారు శుభ్రం చేశారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నేటి నుంచి నా బంగారు బందరు-స్వచ్ఛ బందరు కోసం శ్రమదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, నగరంలోని కూటమి నాయకులతోపాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సమిష్టిగా శుభ్రం చేశామన్నారు. ఇదే రీతిలో ప్రతివారం నగరంలోని ఏదొక ప్రాంతంలో, సుందరీకరణలో భాగంగా పౌరులు సైతం స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో వారికి ఆదర్శంగా నేటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు.
ప్రతి ఒక్కరి ఇంటి పరిసరాలతో పాటు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రం చేసుకోవడానికి ఒక పూట శ్రమదానం చేయడం ద్వారా బందరును స్వచ్ఛ నగరంగా మార్చగలమన్నారు. ఈ విధమైన కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వ ఆసరాకు పౌరులు చేయూతను అందించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. సిఎస్ఆర్, ఇతర నిధులతో అవసరమైన అభివృద్ధి పనులను చేపడతామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పార్కులు, డ్రైనేజీ నిర్మాణాలు, అవసరమైన చోట్ల స్మశాన వాటికలు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, కార్పొరేషన్ నుంచి వచ్చిన రూ.5 కోట్ల నిధులతో ఆయా అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామన్నారు. నగరంలో లక్ష టన్నులకు పైగా పేరుకుపోయిన చెత్త తొలగింపునకు రూ.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, అదేవిధంగా డ్రైనేజీ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులకు రూ.75 నుంచి రూ.100 కోట్లతో అంచనాలను తయారుచేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలందరికీ రూ. 200 లకే నీటి కొళాయి కనెక్షన్లు తక్షణమే ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, సోడిశెట్టి బాలాజీ, కార్పొరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News