Breaking News

విద్యుత్ ఛార్జీల వడ్డన సరికాదు

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలను కుప్ప కూల్చి నాశనం చేసిందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటివరకు చంద్రబాబు నెరవేర్చకపోగా.. ప్రజలపై మరింత భారం మోపే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూ అప్ ఛార్జీలు ఎత్తేస్తామని ఎన్నికల ముందు ప్రతి సభలోనూ బీరాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ.6073 కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఓమాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట చెప్పడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. రాబోయే ఐదేళ్లు కరెంట్ ఛార్జీలు పెంచనని ఆగష్టు 2 విద్యుత్ రంగంపై సమీక్షలో చంద్రబాబు చెప్పిన మాట ఏమైందని మల్లాది విష్ణు ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా అన్ని విధాలుగా ప్రజలకు మేలు చేస్తానని.. ఎన్నికల ముందు జనవరి 19, 2024 న వెంకటగిరిలో చెప్పినవన్నీ నీటి మూటలేనా..? సమాధానం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో సెంట్రల్ నియోజకవర్గంలో డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రియల్ కలిపి 1,46,427 మంది విద్యుత్ వినియోగదారులపై దాదాపు రూ. 100 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. అలాంటప్పుడు ఇది మంచి ప్రభుత్వమా.? సామాన్య మధ్య తరగతి ప్రజల్ని ముంచే ప్రభుత్వమా.? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి, అధిక భారం వేసే విధానాన్ని కూడా గతంలో టీడీపీ సర్కారే అమలు చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చంద్రబాబు వల్లే విద్యుత్ రంగం నాశనమైంది
చంద్రబాబు వల్లే విద్యుత్ రంగం నాశనమైందని మల్లాది విష్ణు ఆరోపించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటికి డిస్కంలు రూ.4,315 కోట్ల నష్టాల్లో ఉంటే.. 2019 నాటికి అవి ఏకంగా రూ. 20 వేల కోట్లకు చేరాయని గుర్తుచేశారు. అంతేకాకుండా ఉచిత విద్యుత్ కు సంబంధించి రూ.43,744 కోట్లు బకాయిలు పెట్టారని.. వాటిని వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. గతంలో కరెంట్ ఛార్జీలు తగ్గించమని అడిగిన అమాయకులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని మల్లాది విష్ణు గుర్తుచేశారు. కానీ విద్యుత్‌ సమర్ధ వినియోగంలో గత వైసీపీ ప్రభుత్వం జాతీయ స్ధాయిలో అనేక అవార్డులు సొంతం చేసుకుందని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలపై భారాలు అధికమయ్యాయని మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రతీది వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెడుతూ.. చేయవలసిన పనుల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలుకాలేదని.. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కే ఈ ప్రభుత్వం పరిమితమైందన్నారు. ఇప్పటికైనా సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్‌ ఛార్జీలు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల తరపున పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *