మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా అతి త్వరలో రూపుదిద్దుకోనుందని, ఆ దిశగా గుంతలు లేని రహదారులే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం నగరంలోని కాలేఖాన్ పేట శివగంగ గుడి వద్ద చిన్నాపురం మీదుగా కమ్మవారి చెరువుకు వెళ్లే రహదారి మార్గంలో 40 లక్షల రూపాయల వ్యయంతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి లతో కలిసి జెసిబి కి పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి వాసంశెట్టి సుభాష్ ను కూర్చోబెట్టుకొని కంకరపై కాసేపు రోడ్డు రోలర్‌ను నడిపి అందర్నీ ఆశ్చర్య చకితులను చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతల రహదారులు కనబడ్డాయన్నారు. దీంతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం గుంతలు లేని రహదారులే లక్ష్యంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని తద్వారా అభివృద్ధి దిశగా బాటలు వేయాలని సంకల్పించిందన్నారు. జిల్లాలో 96 రహదారుల్లో 33 కోట్ల రూపాయల ఖర్చుతో గుంతలు పూడ్చే కార్యక్రమం మంజూరైందన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తవుతాయన్నారు ప్రతి చోట రోడ్లు బాగా లేవని మెల్లమెల్లగా వచ్చే 2, 3 సంవత్సరాల్లో అన్ని రోడ్లు, మురికి కాలువలు పూర్తి చేసుకుంటామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ లు రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు కృషి తీవ్రంగా చేస్తున్నారన్నారు. అతి త్వరలోనే స్వర్ణాంధ్రప్రదేశ్ చూడబోతున్నామన్నారు.
రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 360 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల్లో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అనకాపల్లిలో ప్రారంభించారన్నారు.
మచిలీపట్నంలో నియోజకవర్గంలో నేడు సోమవారం ఆ కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి చేతుల మీదుగా శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమం వచ్చే సంక్రాంతి నాటికి పూర్తవుతుందన్నారు. రహదారుల్లో గుంతలు ఉండటంతో అటు ప్రజలతో పాటు ఇటు వాహనాలు చాలా దెబ్బతినడం జరిగిందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 5.80 కోట్ల రూపాయల వ్యయంతో 19 రహదారుల్లో గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఎంపీ బాలశౌరి చొరవతో పి ఎం జి ఎస్ వై కింద పోలాటితిప్ప నుండి పల్లె తుమ్మలపాలెం వరకు, పొట్లపాడు తాళ్లపాలెం మీదుగా మోది కానూరుకు వెళ్లే మార్గంలో రెండు వంతెనలు మంజూరయ్యాయన్నారు . చిన్నాపురం నుండి కమ్మవారి చెరువు రోడ్డు వరకు రెండు వరుసల రహదారి కోడూరు వరకు, శివగంగ నుండి పల్లె తుమ్మలపాలెం వరకు 5 కోట్ల రూపాయలు రహదారుల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారన్నారు.
రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నాశనమైందని దాన్ని బాగు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులను తీర్చిదిద్దాలని ఆకాంక్షతో పనిచేస్తున్నామన్నారు.
మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ గత 3, 4 సంవత్సరాలు రహదారుల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని, రాష్ట్రం అవతరించాక ఇటువంటి దుస్థితి ఇంతవరకు లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంతలు లేని రహదారుల నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. త్వరలో అన్నిచోట్ల కొత్త రహదారులు వస్తాయన్నారు. అభివృద్ధి అనేది మంచి రహదారులపై ఆధారపడి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డిఓ కే స్వాతి, రహదారులు భవనాల శాఖ ఈఈ లోకేష్, స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News