గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో బకాయి ఉన్న నీటి మీటర్ల చార్జీలు వెంటనే పూర్తిగా చెల్లించాలని, లేనిచో ట్యాప్ లను డిస్ కనెక్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్ తో కలిసి డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లతో నీటి మీటర్ల చార్జీలు, ఆస్తి, ఖాళీ స్థల పన్ను వసూళ్లు వేగవంతం పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా నీటి మీటర్ల బకాయిలపై సమీక్షించి, లక్షల్లో బకాయిలు ఉండుట గమనించి సంబందిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బకాయిల వసూళ్లకు ప్రత్యేక బృందాల ద్వారా 3 రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వసూళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. బకాయిలు చెల్లించని వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమన్నారు. అలాగే నగరపాలక సంస్థకు బకాయిలు ఉన్న గృహ యజమానులు 60 రోజుల్లో చెల్లించాలని, లేనిచో కుళాయి తొలగింపు చేపడతామన్నారు. అనధికార కుళాయిలను గుర్తించామని, వాటిని వెంటనే తొలగించడానికి ఏఈల వారీగా చర్యలు తీసుకుంటామన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ఉన్న వారు ఉచిత కుళాయిల కోసం స్థానిక వార్డ్ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బకాయి ఉన్న ఆస్తి, ఖాళీ స్థల పన్నులను నగరపాలక సంస్థ కార్యాలయ క్యాష్ కౌంటర్లలో చెల్లించి రశీదులు పొందాలన్నారు. మీటర్ రీడర్లు ప్రతి రోజు 50 మీటర్ల రీడింగ్ తీసి, ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి రోజువారీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వార్డ్ సచివాలయాల వారీగా ప్రతి అసెస్మెంట్ ని తనిఖీ చేసి, అండర్, అన్ అసెస్మెంట్లను గుర్తించి, తదుపరి సమావేశం నాటికి డిమాండ్ లో పురోగతి ఉండాలన్నారు. రెవెన్యూ వసూళ్లలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి నగదు పురస్కారాలు అందిస్తామని తెలిపారు.
సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, రెవెన్యూ అధికారులు రెహమాన్, రవికిరణ్ రెడ్డి, సాదిక్ భాష, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News