-యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం
-యువతే మనకు ఆస్తి…ఉద్యోగాలు కల్పిస్తే సంపద సృష్టిస్తారు.
-సంపద సృష్టి ద్వారా ఆదాయం పెరిగి ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు
-రాష్ట్రంలో 22 లక్షల ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు కృషి
-ఇన్నోవేషన్ హబ్ ల కోసం రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్
-175 ఇండస్ట్రియల్ పార్కులను ఇన్నోవేషన్ హబ్ లతో అనుసంధానం చేస్తాం
-ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే పెద్దఎత్తున ప్రోత్సాహం
-3 ఏజన్సీ జిల్లాలను ఆర్గానిక్ జోన్స్ గా ప్రకటిస్తాం
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-పారిశ్రామిక పాలసీలపై అసెంబ్లీలో సీఎం ప్రసంగం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్లోబల్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగ కల్పనే ప్రధాన ధ్యేయమని అన్నారు. ఏ పాలసీ తెచ్చినా అది ఉద్యోగాల కోసమే. యువతే మనకు ఆస్తి…వారికి ఉద్యోగాలు కల్పిస్తే సంపద సృష్టిస్తారన్నారు. థింక్ గ్లోబలీ…యాక్ట్ గ్లోబలీ ఆలోచనా విధానంతో ముందుకెళ్తేందుకే నూతన పారిశ్రామిక పాలసీలు తెచ్చామని స్పష్టం చేశారు. శాసనసభలో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆరు పారిశ్రామిక పాలసీలపై సభలో ప్రసంగించారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలెప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఆంట్రపెన్యూర్ డెవలెప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ 4.0 పాలసీలు రాబోయే రోజుల్లో చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాయన్నారు. సభలో సీఎం చంద్రబాబు ఏమన్నారంటే….
గత ప్రభుత్వ వేధింపులతో పరిశ్రమలు పరాయి రాష్ట్రాలకు
‘గత ఐదేళ్లు రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు…వచ్చినవి కూడా పాలకుల వేధింపులతో పక్క రాష్ట్రాలకు వెళ్లాయి. సంపద సృష్టించాలంటే పెట్టుబడులు రావాలి. సేవారంగం అభివృద్ధి కావాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తే రైతులకు మరింత మేలు చేకూరుతుంది. అలాంటప్పుడే సంపద సృష్టితో ఆదాయం పెరుగుతుంది, తద్వారా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని చేపట్టవచ్చు. ప్రస్తుతం తీసుకొచ్చిన పాలసీలన్నీ పారదర్శకంగా అమలు చేస్తాం. 2014-19 మధ్య ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ పాలసీ ద్వారా పెట్టుబడులు ఆకర్షించాం. తద్వారానే రాష్ట్రానికి కియా కార్ల పరిశ్రమ వచ్చింది. హీరోమోటార్స్, సమ్ కార్న్ ఎనర్జీ, రాష్ట్రీయ ఇష్పాత్ నిగమ్, అమరరాజా లాంటి పరిశ్రమలు వచ్చాయి. కానీ 2019-24 మధ్య 5 వేల కోట్లకు మించి ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. 2014-19 మధ్య 227 ఎంఓయూలు చేశాం..కొన్ని ఆచరణలోకి రాగా మిగతావి గత ప్రభుత్వం విధానాలతో వెళ్లిపోయారు. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం 15 వేల ఎకరాల భూమిని విద్యుత్, నీళ్లు, మిగతా మౌళిక సదుపాయాలకు కూడా ఇబ్బంది లేకుండా చేశాం. కానీ అధికారంలోకి రాగానే రూ.30 ఉన్న నీటి టారిఫ్ రూ.120కి పెంచారు. మా హయాంలో రూ.3,900 కోట్లు పరిశ్రమదారులకు ప్రోత్సాహకాలుగా అందించాం….గత ప్రభుత్వం రూ.1900 కోట్లు అప్పులు పెట్టి పోయింది. కేంద్రం తెచ్చిన పీఎల్ఎక్స్ స్కీం ద్వారా రూ.1.28 లక్షల కోట్లు గ్రాంట్ తో 8.50 లక్షల ఉద్యోగాలు ఉంది…దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దేశంలో ఆర్థిక సంస్కరణలు రాకముందు పెద్దగా పెట్టుబడులు రాలేదు. ప్రభుత్వం రంగంలో మాత్రమే పెట్టుబడులు ఉండేవి. కానీ 1991లో వచ్చిన ఆర్ధిక సంస్కరణలను అందిపుచ్చుకున్నాం. ఐటీని మనవాళ్లు అందిపుచ్చుకోవడంతో నేడు ఆంట్రపెన్యూర్స్ గా ఉంటున్నారు.’ అని అన్నారు.
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిస్తాం
‘ప్రధాని మోదీ వికసిత్ భారత్-2047 రూపకల్పన చేశారు. 2047 నాటికి మన దేశం ప్రపంచంలో నెంబర్-1 లేదా నెంబర్-2 గా ఉంటుంది. దేశంలో మనరాష్ట్రం నెంబర్-1గా ఉంటుంది. అందుకే సరికొత్తగా ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలు రూపొందించాం. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తాం. గతంలో ఈజ్ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో వచ్చాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంతో ముందుకెళ్తున్నాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాల్సి ఉంది. ప్రాడెక్ట్ బ్రాండ్ ను కూడా పెంచుతాం. వన్ ఫ్యామిలీ..వన్ ఆంట్రప్రెన్యూర్ ను సాధించి తీరతాం. సంకల్పంతో చేస్తే ఏదైనా సాధ్యమే. ఎకనామిక్ డెవలెప్మెంట్ బోర్డును మళ్లీ ఏర్పాటు చేస్తున్నాం. రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఒక సీనియర్ అధికారిని ఎస్కార్ట్ అధికారిగా నియమిస్తాం. ఈ అధికారి అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తయ్యేలా పర్యవేక్షిస్తారు. సింగిల్ డెస్క్ పోర్టల్ తెస్తున్నాం…అప్రూవల్స్ అన్నీ రియల్ టైంలో ఇస్తాం. సెల్ఫ్
సర్టిఫికేట్ సదుపాయం కల్పిస్తాం. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తాం.’ అని ప్రకటించారు.
ఐదేళ్లలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
‘అన్ని రాష్ట్రాల కంటే పెట్టుబడులు పెట్టేవారికి మిన్నగా ప్రోత్సాహకాలు అందించే విధానాన్ని తీసుకొచ్చాం. ఐదేళ్ల పాటు ఈ పాలసీలు అమల్లో ఉంటాయి. రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా రూపకల్పన చేశాం. దీని వల్ల 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే ఆలోచన చేస్తున్నాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 10 బిలియన్ యూస్ డాలర్స్ రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ లో 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్ లు ఏర్పాటు చేస్తాం. ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా పారిశ్రామిక వేత్త కావాలనే ఆసక్తిని తీసుకొస్తాం. గ్లోబల్ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లు ఏర్పాటు చేస్తాం. ఏ రాష్ట్రానికి లేని విధంగా మనకు వెయ్యి కి.మీ సముద్ర తీరం ఉంది. 500 ఫ్యార్చూన్ కంపెనీలు ఆకర్షించేలా పాలసీ రూపొందించాం. లాజిస్టిక్, ఫ్యూయల్ కాస్ట్ తగ్గిస్తే వ్యాపారల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. 4 ఇన్వెస్టిమెంట్ కేటగిరీలు తీసుకొచ్చాం. సబ్ క్లాస్ అనేది రూ.50 కోట్ల నుండి రూ.500 కోట్ల దాకా, లార్జ్ అనేది రూ.501 నుండి రూ.1000 కోట్ల దాకా, మెగా అనేది రూ.1001 నుండి రూ.5000 కోట్ల దాకా, అల్ట్రా మెగా అనేది రూ.5001 కోట్లకు పైబడి ఉంటాయి. ఆయా పరిశ్రమలకు మనం ఇచ్చే పెట్టుబడి సబ్సీడీ 12 నుండి 15 శాతం వరకు ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయిమెంట్ సబ్సిడీ కూడా తెచ్చాం. అదనంగా ఉద్యోగాలు కల్పించేవారికి 10 శాతం మేర ప్రోత్సాహకాలు ఎక్కువ ఇస్తాం. గ్రీన్ ఎనర్జీతో వెళ్లేవారికి 6శాతం ప్రోత్సహకాలు అదనంగా ఇస్తాం. ఎంఓయూ కుదుర్చుకున్న వెంటనే పెట్టుబడులు పెట్టేవారికి 30 శాతం పెట్టుబడి సబ్సీడీ ఇచ్చి వాల్యూ అడిషన్ 40 శాతం ఇస్తాం. రూ.250 కోట్లు వరకూ ఎవరైనా పెట్టుబడి పెడితే 12 నుండి 40 శాతం దాకా ప్రోత్సహకాలు వస్తాయి. 18 నెలల్లోనే పరిశ్రమల కార్యరూపం దాల్చితే 18 శాతం అదనంగా ప్రోత్సహకాలు ఇస్తాం. ప్రత్యేకంగా వాల్యూ యాడిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కు వస్తే 20 శాతం ప్రోత్సహకాలు అదనంగా ఇస్తాం. దేశంలోనే ఇది ఒక బెస్ట్ పాలసీ. ఎంఎస్ఎంఈ, ఆంట్రపెన్యూర్స్ డెవలెప్మెంట్ పాలసీలో భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడలు ఆకర్షిస్తాం. కనీసం రూ.50 వేల కోట్లు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తేవాలని పని చేస్తున్నాం. కనీసం ఎంఎస్ఎంఈలు 22 లక్షలు ఉండేలా చూస్తున్నాం.
ఇండస్ట్రియల్ పార్కులతో ఇన్నోవేషన్ హబ్ ల అనుసంధానం
‘అమరావతిలో రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయబోతున్నాం. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన రతన్ స్ఫూర్తిగా ఆంట్రప్రెన్యూర్స్ ను ప్రోత్సహిస్తాం. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తాం. వీటికోసం ఐదేళ్లలో రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తాం. 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ను ఇన్నోవేషన్ హబ్ కు అనుసందానం చేస్తాం. కొత్త ఆంట్రప్రెన్యూర్స్ ను ప్రమోట్ చేస్తాం. నాడు ఐటీ రెవల్యూషన్ లాగా ఆంట్రప్రెన్యూర్ రెవల్యూషన్ తెస్తాం. కేంద్రం ఇచ్చే పథకాలు ఉపయోగించుకుంటాం. ఫస్ట్ జనరేషన్ ఆంట్రప్రెన్యూర్ ను ప్రమోట్ చేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ ప్రోత్సహకాలు అదనంగా 10 శాతం ఇస్తాం. జనాభా దామాషా ప్రకారం అన్ని రాంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు రాణించాలి. 500 కోట్ల కార్పస్ ఫండ్ తో క్రెడిట్ యాక్సిస్, టెక్నాలజీ ట్రాన్ఫర్, స్పెసిఫిక్ ప్రొడక్ట్ ప్రమోషన్ కు ఖర్చు చేస్తాం. ఇటీవలే ప్రధాని దీదీ డ్రోన్ యోజన పాలసీని ప్రకటించారు. ఈ పథకంలో గరిష్టంగా రూ.8 లక్షల వరకూ సబ్సిడీ ఇచ్చి స్వయం సహాయక సంఘాలను ను ప్రోత్సహిస్తున్నారు. దీదీ డ్రోన్ యోజనలో దాదాపు 20 వేల మంది ఎంఎస్ఎంఈ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ముందుకొచ్చే వారిని ప్రోత్సహించి ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పటికే ఓర్వకల్లులో 300 ఎకరాలు డ్రోన్ హబ్ కు కేటాయించాం.’ అని వివరించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 3 లక్షల మందికి ఉపాధి
‘ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా కొంత ఏపీకి మంచి ప్రయోజనం ఉంది. సీమలో హార్టికల్చర్, కోస్తాలో ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉంది. అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఏజన్సీలో ఆర్గానిక్ సాగు నడుస్తోంది. ఈ అవకాశాలన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉపయోగించుకుంటాం. ఐదేళ్లలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టకున్నాం. 3 లక్షల మందికి ఉపాధితో పాటు 15 బిలియన్ యూఎస్ డాలర్ల ఎగుమతులను సాధిస్తాం. 3 ఏజన్సీ జిల్లాలను ఆర్గానిక్ జోన్స్ గా ప్రకటిస్తాం. రూ.250 కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి రీసెర్చ డెవలప్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, క్వాలిటీ సర్టిఫికేషన్ కోసం ఖర్చు చేస్తాం. ఏ ప్రొడక్ట్ ఎక్కడ తయారైందనేది చరిత్ర చూసుకునేలా గుర్తించే విధానం తీసుకొస్తాం. రూ.100 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాం. టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందిస్తాం. ఎడ్జిస్టింగ్ యూనిట్స్ కు టెక్నాలజీ అప్ గ్రేడ్ కు 20 శాతం, మోడరన్ మీట్ ప్రాసెసింగ్ యూనిట్ కు 35 శాతం ప్రోత్సహకాలు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 10 శాతం అడిషనల్ కేపిటల్ సబ్సిడీ అందిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఎంత ప్రమోట్ చేస్తే రైతుల్లో స్థైర్యం వస్తుంది. కూరగాయలు, పండ్ల సాగులో ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి…దీనికి కారణం వాల్యూ చైన్ లేదు. ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ప్రణాళిక ప్రకారం ముందుకెళితే ప్రపంచానికే మన దేశం ఫుడ్ బాస్కెట్ మారే అవకాశం ఉంటుంది.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల నుండి మినహాయింపు
‘ప్రైవేట్ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా 10 ఎకరాల వరకూ నానో పాలసీ తెస్తాం. ఎంఎస్ఎంఈ పార్కులు 10 నుండి 100 ఎకరాల వరకు, పెద్ద పార్కులు 100 నుండి 1000 ఎకరాలు, మెగా పార్కులు 1000 ఎకరాల పైన ఏర్పాటుకు కృషి చేస్తాం. ప్రభుత్వ భూమల్లో ప్రైవేట్ వ్యక్తులు పార్కులు ఏర్పాటు చేస్తామంటే భూములు అందిస్తాం. రైతులు ముందుకొచ్చినా పార్కు రూపొందించేందుకు ప్రోత్సహకాలు ఇచ్చి ప్రచారం చేస్తాం. పెట్టుబడులు, ప్రాజెక్టులు, రోడ్లు, ఇలా అన్నింటిలోనూ రానున్న రోజుల్లో రైతులను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది. సొంత భూమిలో పార్కు ఏర్పాటు చేసుకునే రైతులకు వెంటనే అనుమతితో పాటు ప్రోత్సహకాలు అందిస్తాం. ఎవరు ఏ మోడల్ లో వచ్చినా 100 శాతం మేర నాలా, సీ.ఎల్.యు ఛార్జెస్, లే అవుట్ అప్రువల్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుండి మినహాయింపునిస్తాం. నానో, ఎంఎస్ఎంఈ పార్కులకు రూ.5 లక్షల కేపిటల్ సబ్సీడీ, లార్జ్ అండ్ మెగా పార్కులకు ఎకరాకు రూ.3 లక్షల చొప్పున ప్రోత్సహకాలు ఇస్తాం. మనం తెచ్చిన నూతన పాలసీలు బాగున్నాయని పారిశ్రామిక వేత్తలు కితాబు ఇస్తున్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ గేమ్ ఛేంజర్ అవుతుంది. ఈ రంగంలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. సోలార్ ప్రాజాక్టులో 78 గిగా వాట్లు, విండ్ లో 35 గిగావాట్లు, స్టోరోజ్ ఎనర్జీలో25 గిగా వాట్లు, బ్యాటరీ 25 గిగా వాట్లు, గ్రీన్ హైడ్రోజన్ అనుబంధ ఉత్పత్తులు 1.5 గిగా వాట్ల ఉత్పత్తిని సాధిస్తాం. కంప్రెస్డ్ బయో గ్యాస్ 10 వేల టన్నుల టీపీడీ, ఈవీ స్టేషన్లు 5 వేలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ఎనర్జీ కాస్ట్ తగ్గింపే ధ్యేయంగా పెట్టుకన్నాం…దాని కోసం పై ప్రోత్సహకాలు అందిస్తాం. క్వార్ట్జ్ తో సోలార్ ప్యానెల్ తయారు చేయొచ్చు…ఏపీలో సోలార్ ప్యానెల్ పరిశ్రమ రావాల్సి ఉంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైబ్రోజన్ మన రాష్ట్రానికి వచ్చాయి. ఈ నెల 25న విశాఖలో ప్రధాని మోదీ వచ్చి ఫౌండేషన్ వేస్తారు. మూడు ఫేజ్ లో రూ.84,700 కోట్లు పెట్టుబడులు వస్తాయి. ఏపీజెన్కో, ఎన్టీపీసీ కలిసి ఈ పెట్టుబడులు పెడతాయి. గ్రీన్ ఎనర్జీలో 25 వేల ఉద్యోగాలు సాధిస్తాం. రిలయన్స్ కూడా రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి మూడేళ్లలో 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఎంఓయూ కుదుర్చుకన్నారు. 500 సీబీజీ ప్లాంట్లు పెడతామని రిలయన్స్ సంస్థ పేర్కొంది. ఒక్కో ప్లాంట్ కు రూ.130 కోట్లు ఖర్చు అవుతుంది. దీంతో 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.57,650 కోట్ల ఆదాయం వస్తుంది. ఐదేళ్ల విధ్వంసంతో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి కొంత అనుమానం కూడా వచ్చింది…వారికి కూడా భరోసా కల్పించాం. మనం చేసే పబ్లిక్ పాలసీలు రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి ఉపయోగపడతాయని బలంగా నమ్ముతున్నాం.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.