-అంగన్వాడి కేంద్రంలో చేపట్టే మరుగుదొడ్లు, నీటి సరఫరా పనులలో నాణ్యత ఉండేలా చూసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా అన్ని పనులు నిర్దేశించిన గడువు లోపు పూర్తి కావాలి అని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జల జీవన్ మిషన్ పథకం పనుల పురోగతిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో జిల్లాలోని జల జీవన్ మిషన్ పథకంను అమలు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 2532 పనుల్లో భాగంగా 1333 పనులు పూర్తయ్యాయని మిగిలినవి పురోగతిలోకి తీసుకురావాలని తెలిపారు. జలజీవన్ మిషన్ కు సంబంధించిన పనులను పురోగతిలోకి తీసుకురావడానికి పల్స్ సర్వే పక్రియ కొనసాగుతోoదని, ఈ సర్వే నిర్దేశించిన గడువులోగా పూర్తి కావాలని తెలిపారు. పూర్తికాని కొళాయి కనెక్షన్ల పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.
ఎంపీ లాండ్స్ కింద నిధులతో మంజూరైన పనులు, జడ్పీ (బోర్లు, మోటర్లు) CPWS (సమగ్ర నీటి పథకం) పనులు పూర్తి కావాలన్నారు. అంగన్వాడి కేంద్రంలో మరుగుదొడ్లు నిర్మాణం, త్రాగునీరు సరఫరా చేయడం వంటి పనులను నాణ్యతతో నిర్వహించాలని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో తాగునీటి సరఫరా సంబంధించి కిచెన్, బాత్రూం, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి ప్రదేశాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు వాడుకునేలాగా కుళాయి కనెక్షన్లు చేపట్టేలా సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అనంతరం మన మరుగుదొడ్డి- మన గౌరవం అనే పోస్టర్ను ను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ కుమార్, అన్ని మండలాల ఈ ఈ, డి ఈ, ఎ ఈ లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News