గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం చేపట్టిన స్వచ్చ ఆంధ్ర-స్వచ్చ దివాస్ లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే కార్యక్రమాల్లో నగరంలోని వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్గించి, సదరు కార్యక్రమాలకు ప్రోటోకాల్ మేరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ నోడల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్వచ్చ ఆంధ్ర-స్వచ్చ దివాస్ కార్యక్రమాల నిర్వహణపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు దేశంలో అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపిని తీర్చిదిద్దడానికి 12 నెలలకు 12 థీమ్ లతో స్వచ్చ ఆంధ్ర-స్వచ్చ దివాస్ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. అందులో భాగంగా ఈ నెల 18న శనివారం న్యూ ఇయర్ – క్లీన్ స్టార్ట్ థీమ్ తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ సిద్దం చేశామన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ నుండి హిందూ కాలేజి సిగ్నల్ జంక్షన్ వరకు షుమారు 2 వేల మందితో స్వచ్చత ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ చేపడతామని, అందుకు ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందించాలని అదనపు కమిషనర్ కు భాధ్యతలు కేటాయించామని తెలిపారు. అదే విధంగా వార్డ్ సచివాలయాల వారీగా ర్యాలీలు, మానవహారం, ప్రతిజ్ఞలో స్థానిక ప్రజా ప్రతినిధులను, ప్రజలను భాగస్వాములను చేయాలని, నోడల్ అధికారులు పూర్తి భాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా సచివాలయం పరిధిలో మాస్ క్లీనింగ్, జిఎంసి స్థలాలు, డ్రైన్ల శుభ్రం, గార్బేజ్ తొలగింపు చేపట్టాలన్నారు. ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య విభాగ అధికారులు సమన్వయంతో కార్యక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర ప్రజలు కూడా తమ ఇళ్లల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్దాలను తడిపొడిగా వేరు చేయడం, హోం కంపోస్ట్, క్లస్టర్ కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలని, అందుకు నగరపాలక సంస్థ నుండి తగిన తోడ్పాటుని అందిస్తామని తెలిపారు.
సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, మేనేజర్ బాలాజీ బాష, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి రెట్టించిన ఉత్సాహంతో భారీగా తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
-ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ -అదరహో అనే విధంగా యువతను, ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు …