-కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడి
-జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్.బి.హెచ్.ఎమ్) పై ప్రశ్నించిన ఎం.పి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్.బి.హెచ్.ఎమ్) 2020-21 నుండి అమలవుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎన్.బి.హెచ్.ఎమ్ కింద 298 ప్రాజెక్టులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) 51 మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కి గత ఐదేళ్లలో ఎన్.బి.హెచ్.ఎమ్ కింద ఒక్క ప్రాజెక్టు మంజూరు కాగా, ఒక్క రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్.పి.వో) కూడా మంజూరు కాలేదు.ఎన్.బి.హెచ్.ఎమ్ కింద రాష్ట్రానికి ప్రత్యేకంగా తేనె హబ్‌లు , క్లస్టర్‌లు మంజూరు అయినట్లు సమాచారం లేదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా గత ఐదేళ్లుగా ఎన్.బి.హెచ్.ఎమ్ కింద ఎన్ని ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వాటికి కేటాయించిన నిధులు, ఆ వివరాలు, రాష్ట్రల వారీగా ఈ పథకం కోసం వచ్చిన ప్రతిపాదల వివరాలు, ఈ మిషన్ ద్వారా లబ్ధి పొందిన రైతు ఉత్పత్తిదారుల సంస్థల వివరాలు తెలియపర్చాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ లోక్ సభలో మంగళవారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖను లిఖిత పూర్వకంగా అడగటం జరిగింది. వీటికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఎన్.బి.హెచ్.ఎమ్ కింద దశ-I (2020-21 నుండి 2022-23 వరకు)లో రూ.130 కోట్ల కేటాయించగా, రూ.91.13 కోట్లు వినియోగించినట్లు తెలిపారు. ఇక దశ-II (2023-24 నుండి 2025-26 వరకు)లో రూ.370 కోట్ల కేటాయింపులో ఇప్పటివరకు రూ.103.35 కోట్లు వినియోగించినట్లు పేర్కొన్నారు. ఎన్.బి.హెచ్.ఎమ్ కింద ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో స్వీకరించబడతాయన్నారు. కేంద్ర స్థాయిలో, కేంద్ర అమలు సంస్థలు నేరుగా జాతీయ తేనె బోర్డుకు (NBB) ప్రతిపాదనలు సమర్పిస్తాయి. రాష్ట్రాల ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ (SLSC) ద్వారా పరిశీలించి అర్హత కలిగిన వాటిని జాతీయ తేనె బోర్డు(NBB)కి సిఫార్సు చేయటం జరుగుతుందన్నారు.
Prajavartha Online Telugu News