-దేశవ్యాప్తంగా 14 లక్షల మంది రైతులు నమోదు
-ఆంధ్రప్రదేశ్‌లో సహజ వ్యవసాయ క్లస్టర్లు 2,522
-కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడి
-సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ (NMNF) పై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్,ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ (NMNF) అమలు చేస్తోంది. ఈ మిషన్ కింద ఇప్పటివరకు 14,32,309 మంది రైతులు నమోదు కాగా, 5,45,001 హెక్టార్ల భూభాగంలో సహజ వ్యవసాయ పద్ధతులు అమలులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 07.08.2025 నాటికి ఈ మిషన్ కింద మొత్తం రూ. 80,601.50 లక్షలు కేటాయించగా, రూ.30,388.05 లక్షలు విడుదలైనట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడించారు.
సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ (NMNF) కింద కేంద్రం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చేసిన అమలు పై లోక్ సభలో మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా బదులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మిషన్ కింద 37,387 మంది రైతులు నమోదు కాగా, 5,699.2 హెక్టార్ల విస్తీర్ణంలో సహజ వ్యవసాయం జరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.. రాష్ట్రానికి రూ.10,992.09 లక్షలు కేటాయించగా, రూ.5,496.05 లక్షలు విడుదలైనట్లు వివరించారు. రాష్ట్రంలో 2,522 సహజ వ్యవసాయ క్లస్టర్లు గుర్తించి, నమోదు చేసిన రైతులకు 52 రైతు ఫీల్డ్ పాఠశాల శిక్షణలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
అంతేకాక, ఆంధ్రప్రదేశ్‌లో 112 స్థానిక సహజ వ్యవసాయ సంస్థలను (LNFIs) మోడల్ నాలెడ్జ్ డిసెమినేషన్ సెంటర్లుగా ఎంపిక చేశామని, ఇవన్నీ సహజ వ్యవసాయంలో అనుభవం కలిగిన, నైపుణ్యం కోసం గుర్తింపు పొందిన రైతుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్నారు. అయితే, రాష్ట్రంలో కృష్ణి విజ్ఞాన్ కేంద్రం (KVK) ను మోడల్ నాలెడ్జ్ డిసెమినేషన్ సెంటర్‌గా ఎంపిక చేయలేదన్నారు.
సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ రైతులలో సహజ వ్యవసాయం పట్ల అవగాహన పెంపు, రసాయన వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ, ఖర్చు తగ్గింపు, మట్టి సారవంతత పెంపు లక్ష్యాలను సాధించడాన్ని ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి రామనాథ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News