-పోలవరం 85% పూర్తి – 2024-2025 లో రూ.5,512 కోట్లు నిధుల విడుదల
-కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వెల్లడి
-ఆంధ్రప్రదేశ్‌లో PMKSY-AIBP కింద ప్రాజెక్టుల వివరాలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేగవంతమైన సాగునీటి ప్రయోజనాల కార్యక్రమం (AIBP) కింద ఎలాంటి ఈ.ఆర్.ఎమ్ (ERM- విస్తరణ, పునరుద్ధరణ, ఆధునీకరణ) ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వెల్లడించారు.
లోక్ సభలో గురువారం ఎంపీలు కేశినేని శివనాథ్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, బస్తిపాటి నాగరాజు, బి.కె. పార్థసారథి కలిసి ఆంధ్రప్రదేశ్‌లో PMKSY-AIBP కింద ప్రాజెక్టుల వివరాలపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా, ఆ శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖిత పూర్వకంగా బదులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) కింద మంజూరైన సాగునీటి ప్రాజెక్టులు దాదాపు పూర్తి దశకు చేరుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన- వేగవంతమైన సాగునీటి ప్రయోజనాల కార్యక్రమం (PMKSY–AIBP) కింద మొత్తం 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు మంజూరు కాగా, వీటిలో మడ్డిగెడ్డ, గుండ్లకమ్మ, తోటపల్లి, ముసురుమిల్లి, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్, యేర్రకల్వ వంటి ప్రాజెక్టులు 90 శాతం. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 98.3 శాతం, పుష్కర ప్రాజెక్ట్ 98.2 శాతం పూర్తయినట్లు వివరించారు.
తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ , తారకరం తీర్థసాగరం ప్రాజెక్ట్ భూసేకరణ సమస్యలు, పునరావాసం–పునర్వ్యవస్థీకరణ (R&R), న్యాయపరమైన అడ్డంకులు, కాంట్రాక్టు సమస్యల వల్ల ఈ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ 85 శాతం పూర్తయ్యిందని, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రూ.5,512 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వివరించారు.
Prajavartha Online Telugu News