-పడవలు, లాంగ్ ఆర్మ్ యంత్రాలతో ప్రత్యేక పారిశుధ్య చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో కాలువల పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం 1వ వార్డు, సర్కిల్-2 పరిధిలోని కార్మెల్ నగర్, గుణదల మరియు జక్కంపూడి వైఎస్సార్ కాలనీ ప్రాంతాల్లో బుడమేరు కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ ఆధ్వర్యంలో పడవలు, లాంగ్ ఆర్మ్ యంత్రాల సహాయంతో కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు.
ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ, బుడమేరు కాలువలో గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కాలువల్లో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా నీటి ప్రవాహం సజావుగా సాగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఆధునిక యంత్రాల సహాయంతో కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. పడవల సహాయంతో కాలువలోని గుర్రపుడెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుండగా, లాంగ్ ఆర్మ్ యంత్రాల ద్వారా కాలువలోని వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నట్లు వివరించారు.
కాలువల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోందని తెలిపారు.
