-రాష్ట్ర విద్యుత్ రంగం బలోపేతానికి కట్టుబడి ఉన్నాం — ఇంధన శాఖ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-విద్యుత్ సంస్థలను ఆర్థికంగా, నిర్వహణ పరంగా బలోపేతం చేస్తాం
-విద్యుత్ కొరత దృష్ట్యా గృహ, వ్యవసాయ రంగాల విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యం
-విద్యుత్ సంస్థలకు సహకరించాలని వినియోగదారులకు మంత్రి విజ్ఞప్తి
-నెలాఖరుకు విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరే అవకాశం
-విద్యుత్ రంగ అభివృద్ధి బలోపేతం పై ముఖ్యమంత్రి ఆసక్తి — ఇంధన శాఖ మంత్రి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా, నిర్వహణ పరంగా బలోపేతం చేసి భవిష్యత్ లో వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా ,మెరుగైన సేవలు అందాలనే లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఇంధన, పర్యావరణ , అటవీ, గనులు, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తెలిపారు .
ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఈ నెల 18 న విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు . ఈ నేపథ్యంలో విద్యుత్ రంగంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల పై చర్చించేందుకు అధికారులు ఈ రోజు నిర్వహించిన టెలీకాన్ఫెరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో సమస్యలు ఏవైనప్పటికీ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే విషయం లో ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేసారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తున్న దృష్ట్యా ఈ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తెలిపారు.
దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగి , బహిరంగ మార్కెట్ లో కూడా తగినంత విద్యుత్ లభించని ఈ సమయంలో కూడా గృహ వినియోగదారులకు వీలున్నంత మేరకు తక్కువ అంతరాయాలతోనే నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని , వ్యవసాయానికి పగటి పూటే 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. విద్యుత్ కొరత నేపథ్యంలో మే నెల ఒకటి నుండి రైతులకు పగటి పూటే 9 గంటలు విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ కొరత తాత్కాలికమేనని, విద్యుత్ అంతరాయాలు స్వల్పకాలమేనని , ఈ పరిస్థితిని అర్ధం చేసుకుని వినియోగదారులు విద్యుత్ సంస్ధలకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు.
విద్యుత్ రంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినంత చేస్తున్నదని మంత్రి తెలిపారు. విద్యుత్ సంస్థల్ని ఆదుకునేందుకు కేవలం రెండున్నర ఏళ్ళ కాలంలో ప్రభుత్వం దాదాపు రూ 34000 కోట్లు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఇంత స్వల్ప వ్యవధి లో విద్యుత్ సంస్థల కోసం ఇంత భారీ మొత్తాన్ని చెల్లించిన ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చూడలేదని మంత్రి స్పష్టం చేసారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెల కొన్న విద్యుత్ కొరతకు బొగ్గు సంక్షోభమే ప్రధాన కారణమని ఆయన తెలిపారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం తో పాటు దేశంలో గత కొద్ది నెలలుగా ఏర్పడిన బొగ్గు కొరత వల్ల చాలా రాష్ట్రాలు విద్యుత్ ఉత్పాదన తగ్గించి బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు .
దీని వల్ల డిమాండ్ , సరఫరా మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడి ఆంధ్ర ప్రదేశ్ తో సహా అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయినప్పటికీ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు , రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. అదే సమయంలో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యుత్ సంస్ధలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎపుడు సంసిద్ధంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
విద్యుత్ రంగంలో నవరత్నాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ తో పాటు , పేదలు , బలహీన వర్గాలకు చెందినవారికి పరిమితి స్థాయిలో ఉచిత విద్యుత్, సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ కొరత వల్ల ఒక ఎకరా పంట కూడా దెబ్బ తినకూడదనే లక్ష్యం తో రాష్త్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు వ్యవసాయ విద్యుత్ పై ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు .
ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి , విద్యుత్ సంస్థల ఉద్యోగుల సహకారం తో రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు క్రుచ్సి చేస్తానని మంత్రి తెలిపారు. విద్యుత్ రంగం బలోపేతం చేయడం పై ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి తెలిపారు. విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషికి ఉద్యోగుల సహకారం కొనసాగాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
ఇంధన శాఖ కార్యదర్శి , బీ శ్రీధర్, జె ఎం డీ , ఏ పీ ట్రాన్స్కో , ఐ పృథ్వి తేజ్ , డిస్కాముల సి ఎం డీ లు , హెచ్ హరనాథ రావు , జె పద్మ జనార్ధన రెడ్డి , కె సంతోష రావు, డైరెక్టర్ గ్రిడ్ , ఏ వీ కె భాస్కర్ పాల్గొన్న ఈ టెలి కాన్ఫరెన్స్ లో అధికారులు మాట్లాడుతూ ఈ నెల 25 నాటికి విద్యుత్ సరఫరా చాల వరకు మెరుగు పడుతుందని ,, నెలాఖరు నాటికీ విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరే అవకాశముందని అధికారులు తెలిపారు.
రాష్ట్రం లో విద్యుత్ సరఫరా గురువారం నాడు 208 మిలియన్ యూనిట్లు ( ఎం యు) ఉందని , దీనిలో 71 ఎం యూ ఏ పీ జెన్కో నుండి, 40 ఎం యు , కేంద్ర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుండి, 6. 6 ఎం యు జల విద్యుత్ , 24 ఎం యు సౌర విద్యుత్ ద్వారా , 16 ఎం యు పవన విద్యుత్, 9. 4 ఎం యు హిందుజా ద్వారా,11 ఎం యు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి దారులనుండి, 26 ఎం యు ని బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసినట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు విద్యుత్ కొరత ఎదుర్కుంటున్నాయని అధికారులు మంత్రికి వివరించారు . మహారాష్ట్రలో 1375 మెగా వాట్ల లోడ్ చొప్పున 3 గంటలు పాటు లోడ్ షెడ్డింగ్ జరుగుతుందని , డిమాండ్, సరఫరా మధ్య ఆంతర్యం వల్లే ఇలా జరిగిందన్నారు. బొగ్గు కొరత వల్ల డిమాండ్, సరఫరా మధ్య ఆయా రాష్ట్రాలలో అంతరాయం ఏర్పడి లోడ్ షెడ్డింగ్ చేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.
రాబోయే 25 ఏళ్లలో వ్యవసాయ విద్యుత్ కు భరోసా ఇచ్చేందుకు సెకి(సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా ) తో 7000 మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేసుకునేందుకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చు కుందని అధికారులు మంత్రి కి వివరించారు.