Breaking News

నగర మేయర్ తో కలిసి నాడు-నేడు ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మూడేళ్లలో రహదారుల నిర్మాణానికి రూ.95.13 కోట్లు కేటాయింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సత్యనారాయణపురంలోని సర్కిల్ – 2 కార్యాలయంలో రహదారుల నిర్మాణాలకు సంబంధించి నాడు-నేడు ఫొటో ఎగ్జిబిషన్‌ ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నగర ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంలో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత మూడేళ్లలో రూ.95.13 కోట్ల నిధులతో నియోజకవర్గంలో 73.65 కి.మీ. పొడవున రహదారుల పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో రోడ్ల నిర్మాణానికి రూ.91.68 కోట్లు కాగా రూ. 3.45 కోట్లతో మరమ్మతులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రూ. 24.71 కోట్లతో 22.98 కి.మీ. మేర 100 నూతన రోడ్ల నిర్మాణాలను ఇప్పటికే పూర్తి చేసినట్లు వివరించారు. రూ.36.40 కోట్లకు సంబంధించి 20.31 కి.మీ. మేర 78 రోడ్ల పనులు వివిధ దశలో ఉన్నాయన్నారు. మరో రూ. 30.56 కోట్లతో 30.36 కి.మీ. మేర 115 రోడ్ల నిర్మాణాలను త్వరలోనే చేపడతామని వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రహదారుల నిర్వహణను పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో.. రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిని ఇబ్బందికరంగా తయారయ్యాయన్నారు. పైగా రోడ్లు వేస్తామంటూ బ్యాంకుల నుంచి చంద్రబాబు రూ.3,800 కోట్లు అప్పు తీసుకు వచ్చి రోడ్లు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తెలుగుదేశం చేసిన తప్పిదాలకు ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో.. రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందన్నారు. రాష్ట్రంలో ఆర్ అండ్‌ బీ రోడ్లను బాగుచేయడం కోసం దాదాపు రూ. 2,500 కోట్లు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడించారు. పూర్తి చేసిన పనులకు రూ.800 కోట్ల మేర బిల్లులను ఇప్పటికే కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగిందన్నారు. అలాగే వర్షాల కారణంగా అక్కడక్కడ దెబ్బతింటున్న రోడ్లను సైతం వెనువెంటనే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.

ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి
భవిష్యత్తు మంచినీటి అవసరాల దృష్ట్యా భూగర్భజలాల వృద్ధిపై నగరపాలక సంస్థ దృష్టి సారించిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సర్కిల్ -2 కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఇంకుడు గుంతను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలను ఉద్యమస్ఫూర్తితో ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలలో స్థలాలను గుర్తించి ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు. భూగర్భ జలాల పెంపునకు ఈ ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అలాగే నీటి పొదుపునకు సంబంధించి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయవలసిందిగా అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నగరంలో రోడ్ల పునరుద్ధరణ పనులు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లకు, వైసీపీ ప్రభుత్వంలో ఆధునికీకరించిన రోడ్లకు మధ్య వ్యత్యాసం ఫొటో ఎగ్జిబిషన్ లో కళ్లకు కట్టేలా చూపడం జరిగిందన్నారు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంభించే విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రహదారుల వ్యవస్థను జగనన్న ప్రభుత్వం తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం, కుక్కల అనిత రమేష్, ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, ఇసరపు దేవి రాజారమేష్, జానారెడ్డి, నాయకులు బంకా భాస్కర్, దోనేపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *