– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-1 వ డివిజన్ 4 వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్ర చరిత్రలో సువర్ణయుగంగా నిలిచిపోతుందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ 4 వ వార్డు సచివాలయ పరిధిలో శనివారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన పాల్గొన్నారు. తుంగా రాములవీధిలో విస్తృతంగా పర్యటించి.. 204 గడపలను సందర్శించారు. తొలుత స్థానిక శ్రీ బాల అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్నిచ్చిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా గుమ్మం వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతుండటంతో ప్రజల సంతృప్తి స్థాయి విపరీతంగా పెరిగిందన్నారు. ఇంకా సమర్థ రీతిలో పనిచేసేందుకు గడప గడపకూ మన ప్రభుత్వం ఎంతగానో దోహదపడుతోందని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీశారు. చెత్త సేకరణ వాహనం ప్రతి ఇంటికి వెళ్లేలా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. మ్యాన్ హోల్స్ నుంచి మురుగు బయటకు పొంగకుండా.. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని వీఎంసీ అధికారులకు సూచించారు. అలాగే ఎక్కడా తాగునీటి పైపులైన్ల లీకులు లేకుండా చూడాలని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పట్టాల పంపిణీని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు
పి.వి.నరసింహరావు, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత పేదలకు ఉచితంగా భూపంపిణీ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. వేలాదిగా ప్రజలు తరలివచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఆర్ 5 జోన్లో పేదలకు స్థలాలు ఇవ్వకూడదని, ముఖ్యమంత్రి తలపెట్టిన మహాయజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రతిపక్షనేత అనేక కుట్రలు చేశారని మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబుకు తెలిసిందల్లా కోర్టులకెళ్లి అడ్డుకోవడం మాత్రమేనని దుయ్యబట్టారు. పేదల పట్ల చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. చివరకు కోర్టుల ద్వారా న్యాయం జరిగిందని చెప్పారు. సెంట్రల్లో 7,211 మందికి సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించగా.. మహానేత వైఎస్సార్ జయంతి రోజున నిర్మాణాలు ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
పుష్కర మృతుల కుటుంబాలకు మహానాడులో సమాధానం చెప్పాలి
మహానాడులో టీడీపీ ప్రవేశపెట్టే 15 తీర్మాణాలు పూర్తిగా బోగస్ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనలో ప్రజల సమస్యలకు ఎప్పటికప్పుడు తక్షణ పరిష్కారం లభిస్తుండటంతో ప్రతిపక్షాల పరిస్థితి ఏడుపే ఏడుపుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం హయాంలో మీ ప్రచార ఆర్భాటాలకు బలైన 29 మంది కుటుంబాలకు మహానాడు వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ పాలనలో పేదలను పూర్తిగా విస్మరించారని.. విద్యా, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేశారని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవస్థలన్నీ మరలా జీవం పోసుకున్నాయని తెలిపారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలియజేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులు.. ఇలా ఏ ఒక్క వర్గానికి పూర్తిగా న్యాయం చేయలేకపోయిందని మల్లాది విష్ణు విమర్శించారు. కనుకనే అన్ని వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కుయుక్తులను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో 2019 కి మించి తెలుగుదేశానికి ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ(యూజీడీ & వాటర్ సప్లై) రామకృష్ణ, సీడీఓ జగదీశ్వరి, 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాయకులు ఉద్ధంటి సురేష్, కొండా మహేశ్వర్ రెడ్డి, పిల్లి కృష్ణవేణి, బండి వేణు, సన్యాసిరాజు, కొంగితల శివ, కనకరావు, మండాది వెంకట్రావు, నాగరాజు, కొలకలేటి రమణి, వై.శ్రీనివాస్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News