-సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలనలో సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలు ఒక విప్లవమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గవర్నర్ పేటలోని ఐ.వి.ప్యాలస్ నందు 28, 29, 31, 32, 33, 36 డివిజన్ల వాలంటీర్లకు నిర్వహించిన సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన 320 మంది వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. నిస్వార్థ సేవలకు ప్రతిరూపం వాలంటీర్ల వ్యవస్థ అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు. వాలంటీర్లు అని చిన్నచూపు చూసే వారంతా తలదించుకునేలా.. గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నారని కితాబిచ్చారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన సచివాలయాలు, వాటికి అనుబంధంగా నెలకొల్పిన వాలంటీర్ వ్యవస్థ చక్కని సత్ఫలితాలిస్తున్నట్లు తెలిపారు. అర్హులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా అందించడంలో ప్రభుత్వానికి, లబ్ధిదారులకు మధ్య వాలంటీర్ వ్యవస్థ వారధిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పథకాల లబ్ధి కలిగించడం, స్థానికంగా ఉన్న సామాజిక, వ్యక్తిగత సమస్యల్ని గుర్తించి అర్హులతో దరఖాస్తు చేయించడం వంటి పనుల్లో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ నుంచి ఉన్నతాధికారుల వరకు అధికార యంత్రాంగం పటిష్టంగా పనిచేస్తున్న నియోజకవర్గాలలో కృష్ణా, గుంటూరు జిల్లాలో సెంట్రల్ ముందంజలో ఉందని తెలియజేశారు.
వాలంటీర్లు సేవా సైనికులు
జగనన్న సంక్షేమ రాజ్యంలో వాలంటీర్లే సేవా సైనికులని మల్లాది విష్ణు కితాబిచ్చారు. సంక్షేమ వ్యవస్థలో నూటికి నూరు శాతం జవాబుదారీతనంగా వాలంటీర్లు వ్యవహరించడంతో.. ప్రజలలో సంతృప్తిస్థాయి చాలా వరకు పెరిగిందని తెలిపారు. గతంలో రేషన్ అందుకోవాలంటే ఒక పూట కూలీ వదులుకోవాల్సిన పరిస్థితి ఉండేదని.. కానీ నేడు ఇంటి వద్దకే రేషన్ అందుతోందన్నారు. కరోనా కష్ట సమయంలో బయటకు రావాలంటేనే బయపడుతున్న సమయంలో.. ప్రాణాలకు తెగించి వాలంటీర్లు అందించిన సేవలు నిరుపమానమన్నారు. అందుకే వారి సేవలకు గుర్తుగా ఇప్పటికి మూడుసార్లు ప్రభుత్వం అవార్డులు అందించిందని గుర్తుచేశారు. అనంతరం అవార్డులను ప్రదానం చేశారు. 28వ డివిజన్ కు సంబంధించి 45 మందికి సేవామిత్ర., 29వ డివిజన్ కు సంబంధించి 59 మందికి సేవామిత్ర., 31వ డివిజన్ కు సంబంధించి 69 మందికి సేవామిత్ర., 32వ డివిజన్ కు సంబంధించి 65 మందికి సేవామిత్ర., 33వ డివిజన్ కు సంబంధించి 43 మందికి సేవామిత్ర., 36వ డివిజన్ కు సంబంధించి 39 మందికి సేవామిత్ర అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో జోనల్ కమీషనర్ సృజన, సీడీఓ జగదీశ్వరి, కార్పొరేటర్లు బాలి గోవింద్, శర్వాణీ మూర్తి, కొంగితల లక్ష్మీపతి, పెనుమత్స శిరీష సత్యం, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, నాయకులు కనపర్తి కొండా, గుండె సుందర్ పాల్, కొండలరావు, జయకర్, పేరం త్రివేణి రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News